21 June 2007

సినీగీతాల సిరిమల్లి-డాక్టర్‌ వడ్డెపల

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనె

ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే... ... అని భావకవితావినువీథిలో అక్షరనక్షత్రాల ముగ్గుల్ని చిత్రించిందా కలం.

నీ నవ్వులోనా విరజాజి వాన

ఆ వానలోన నేను తడిసేనా హాయిగా ... ... అని అందమైన నవ్వుల్లో పువ్వుల్ని పూయించి, అక్షరవర్షాన్ని కురిపించిందా కవనం.

కురిసింది వానవాన జల్లుకోరగా

విరిసంది ప్రేమప్రేమ తీయతీయగా... .... అని వానలదారాల తోరణాలు పేని

వలపుల మెరుపుల్ని కురిపిస్తుందా స్వరం.

జానపదం నుండి జావళీ వరకు

అంగారం నుండి శృంగారం వరకు

ఆటవెలది నుండి పాటవెలది వరకు...

పరిచయవ్యాసాల నుండి పరిశోధన వరకు

బుల్లి తెర నుండి వెండి తెర వరకు...

మాటల్లో కాకుండా చేతల్లో తన సామర్థ్యాన్ని చూపించిన మౌనవృక్షం, అక్షరగవాక్షాలు తెరిస్తే అగుపించే మూర్తిమత్వం, వెరసి చూస్తే డాక్టర్‌ వడ్డెపల్లి.

సిరిసిల్ల ఖిల్లా (కరీంనగర్‌ జిల్లా) లో రసరమ్యపారిజాతసుమవల్లిగా సముద్భవించిన డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, సాహితీవారసుడుగా అంకురించి, లలితగీతాల పొదరింటిలో చివురించి, సినీగీతాల సురభిళాలతో వికసించిన సినీ కళామతల్లి సిగలో సిరిమల్లియేడాక్టర్‌ వడ్డెపల్లి.

వేలాది లలితగీతాల సృజనలో, గేయకథాకావ్యాల రచనలో, గేయనాటికావిరచనలో, నాటకాల ప్రదర్శనలో, పరిశోధనావివేచనలో, సినారె గారి తదుపతి సాహితీయానం చేస్తున్న డాక్టర్‌ వడ్డెపల్లి, మూడు దశాబ్దాలుగా సినీ గీతాలు రచిస్తూ, ఇటీవలే సినీ దర్శకుడుగా తన విశ్వరూపం ప్రదర్శించారు.

'పాట'కు పట్టం కట్టి, పాటలోనే ప్రాణాలు పెట్టిన వడ్డెపల్లిగారు 1948 సెప్టెంబర్‌ ఐదవ తేదీన లక్ష్మమ్మ-లింగయ్య దంపతులకు మూడవ కొడుకుగా జన్మించారు. వీరు చేనేత కుటుంబానికి చెందినవారు. కానీ చిన్నతనం నుంచి దృష్టి అంతా 'రాత' పైనే ఉండేది. బాల్యంలో నిరంతరం మగ్గాల శబ్దాలు, వీరు హృదయంలో మాత్రాఛందస్సుకు బీజం వేశాయి. తల్లి చదువుకోనప్పటికీ, మాటలన్ని అందమైన జానపదాలతో సాగేవి. ఉగ్గుపాలలో జానపద రసాలు, చేనేత మగ్గాల లయవిన్యాసాలు వడ్డెపల్లి గారిని భావుకుడిని చేశాయి. లేకుంటే

''మమతల మగ్గాల పైన

సమతావస్త్రముల నేస్తా...

మనిషి మనిషిలో వాడని

మల్లెల మనసుల్ని పూయిస్తా''

అని తన కవితాదృక్పథాన్ని అనంతరకాలంలో చాటి చెప్పుకొనేవాడా?

వడ్డెపల్లి గారి బాల్యం, స్కూలు జీవితం సిరిసిల్ల లోనే గడిచింది. శ్రీ వెంకటేశ్వరస్వామి గుడిలోని మైకులో, తన పాటలు కూడా వినిపిస్తే బావుండు అని ఉవ్విళ్లూరేవాడు... పదవ తరగతి విద్యార్థిగా...

''నమో నమో శ్రీరమణా

నను కరుణించుమురా కరుణాకర''

అని శ్రీరాముడిపై తొలి సారి ఓ భక్తిగీతాన్ని రాశారు. స్థానికంగా గాయకుడుగా పేరున్న శ్రీరా ములు అనే గాయకుడు, ఈ పాటను మెచ్చుకొని ట్యూన్‌ చేసి దసరా నవరాత్రుల సందర్భంగా, మైకులో పాడారు. వీరి కవనశక్తిని గ్రహించిన తెలుగు మాస్టార్లు నం దగిరి అనంతరాజశర్మ, కనపర్తి లక్ష్మీనరసయ్య, మరింత ప్రోత్సహించారు. స్కూల్‌ మాగజైన్‌కు తోటి పిల్లలు, తమ పెద్దవారితో రాయించుకొని వస్తే, వీరు స్వయంగా రాసేవారు. అలా, తన పదమూడో ఏటనే ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక, ప్రత్యేకంగా ప్రచురించిన పిల్లల వార్షికసంచిక, కథల పోటీలో వీరి 'విధిలిఖితం' బహుమతికి ఎన్నికైంది.

కథలతో పాటు, నాటకాలు కూడా రాసేవారు. అనేకనాటకాల్లో పాల్గొన్నారు. సినారె గారి 'సినీకవి' నాటికలో తారాపతి పాత్రను పోషించి బహుమతి పొందాడు. 'ఏడు సున్నాలు, పేటెంట్‌ మందు త్రిశంకుస్వర్గం, అశ్వత్థామ, పోతన, కర్ణ, ప్రజారాజ్యం, పిచ్చిరాజు, లవ్‌ మారేజ్‌, కట్టబ్రహ్మన్న' మొదలైన నాటల్లో నటించి, జిల్లాస్థాయిలో బహుమతులు పొందారు.

వీరు హై స్కూలు విద్యార్థిగా వున్నప్పుడే వీరి గురువు కనపర్తిగారు, సినారె గారి ''సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదులదావమా!'' పాటను పాడి వినిపిస్తూ విశ్లేషించేవారట. ఆ పాటలోని పదలాలిత్యం ఎంతో ఆకర్షించగా, అలాంటి పాటలు రావాలని భావించి తన భావుకతకు అక్షరరూపం ఇచ్చేవారు. మెడిసిన్‌ చదవాలనుకొని పి.యు.సి.లో బైపిసి గ్రూపులో చేరారు. కానీ ఫస్టు క్లాసులో పాసైనప్పటికీ, సీటు రానందున, తపాలాశాఖలో ప్రవేశించారు. 1968లో ఉద్యోగంలో చేరిన రోజుల్లోనే తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది. 1969లో 'కనరా నీ దేశం' అన్న గీతం తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసారమైంది. ఆ తర్వాత ఎన్నో వందల గీతాలు రచించారు. వాటిలో కొన్ని ఈ మాసపుపాటగా ప్రసారమైనాయి. 'మనమంత ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి' అన్న గీతం సామూహికగేయ శిక్షణకార్యక్రమానికి జాతీయస్థాయిలో ఎంపికై, 1995 సెప్టెంబర్‌లో అన్ని రేడియో కేంద్రాల ద్వారా ప్రసారమైంది.

196671ల మధ్య రచించిన గీతాలను 'కనరా నీ దేశం' శీర్షికన 1971లో ప్రచురించారు. అంతర్మథనం (1974) వసంతోదయం (గేయకావ్యం), 1978, రాగరథం (లలితగీతంలో 1981 గడ్డిపువ్వు గేయనాటిక (1979), హాలాహలం (1987), మనసా తెలుసా (ముక్తకాలు) ,1990, చిరుగజ్జెలు (బాలగేయ సంపుటి) 1992 మొదలైనవి ప్రచురించారు. తొమ్మిది గేయనాటికలు కూడా రాశారు. 'ఉగాదివేళ, ఆనందహేల, సంక్రాంతి లక్ష్మి' మొదలైన సంగీతనృత్యప్రధానరూపకాలు కూడా రాశారు. వీరు దాదాపు 12 గ్రంథాలు రచించగా, దాదాపు అన్ని రచనలు రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందించాయి.

మర్రి ఎంతగా పైకి పెరిగినా ఊడలతో మట్టి తల్లికి మొక్కు మనసా తన నీడలో మర్రి ఏ ఇతర చెట్టును తల ఎత్తనీయదని తెలుసా!-వంటి ముక్తకాలు, వీరికి ఎంతో పేరు తెచ్చాయి.

'రాగరథం' పుస్తకాన్ని ఎస్‌.పి. బాలు గారికి, 'వసంతోదయం' గేయకథాకావ్యాన్ని దర్శకుడు దాసరి నారాయణరావు గారికి, హాలాహలం గ్రంథాన్ని నటులు కృష్ణ-విజయనిర్మల దంపతులకు అంకితమిచ్చారు.

వీరి బాలల గీతాలు, మహారాష్ట్రలో ఐదు, ఆరవ తరగతుల తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేరాయి.

కవి యంటే వెలిగే దీపం

కవితంటే కాంతికి రూపం

అని నిర్వచించిన వీరు, వివిధపత్రికలకు విలువైన వ్యాసాలు, కథలు, రాస్తున్నారు. తొలి రచన నుండి నేటి వరకు ఆకాశవాణి, 'ఆంధ్రప్రభ' వీరి గేయాలను ప్రసారం చేస్తూ, ప్రచురిస్తూ ప్రోత్సహిస్తోంది. పాటలు రాయాలని భావించి తన భావుకతకు అక్షరరూపం ఇచ్చేవారు.

హై స్కూలులో హెచ్‌ఎస్‌సి తాలూకా స్థాయిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన వడ్డెపల్లిగారు మెడిసిన్‌ చదవాలని, బైపిసి గ్రూప్‌ తీసుకొని నిజాం కాలేజీ హైదరాబాద్‌లో పి.యుసి.లో చేరారు. తీరా వార్షికపరీక్షలకు ముందే నోట్సు, పుస్తకాలను ఎవరో కాజేయటం తో, ప్రప్రథమశ్రేణిలో కాకుండా ప్రథమశ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. దాంతో మెడిసిన్‌ చదవాలన్న కోరిక నెరవేరలేదు.

ఆ రోజుల్లో పియుసి ఫస్ట్‌ క్లాసులో పాసైనవారికి, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వారు నేరుగా ఉద్యోగాలు ఇచ్చేది. 1968లో తపాలశాఖలో చేరారు. ఆ సంవత్సరంలోనే కృష్ణాపత్రికలో 'నేటి కాలం', స్రవంతి పత్రికలో 'ఎవడెరుగును' కవితలు (ఒకేసారి) తొలిసారిగా ప్రచురితమయ్యాయి. పోస్టల్‌ ట్రెయినింగ్‌ కోసం వైజాగ్‌ వెళ్లిన వీరు, సముద్రతీరంలో వెన్నెల అలల మిలమిలలు చూసి ''శిథిల శిల్పాల దాగిన కథల గురించి ఎవడెరుగును'' అన్న శీర్షికతో ఆశువుగా ఓ గేయం రాశారు.

లలితగీతాల లాహిరి

పత్రికలకు పంపించినట్లే, రేడియోకు కూడా తన పాటలను ప్రసారనిమిత్తం పంపించగా 1969లో 'కనరా నీ దేశం వినరా సందేశం' అన్న గీతాన్ని ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం, లలితసంగీతంగా ప్రసారం చేసింది. అది మొదలు నేటి వరకు వందల లలితగీతాలు రాశారు, రాస్తూనే వున్నారు. వీటిలో 'ఈ మాసపు పాటలు'గా, ప్రబోధగీతాలుగా ,'బృందగీతాలు'గా వన్నెకెక్కినవి కూడా వున్నాయి. ''అంతు లేని ఆశలున్న అంతరంగమా!'' ''జగతి రథం జై కొడుతూ (1972)'' ''వెన్నెలంత చల్లనిది స్నేహము'' మొదలైన గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. క్రీస్తు జన్మదినసందర్భాన్ని పురస్కరించుకొని రాసిన గీతం 1983 డిసెంబర్‌లో ఈ మాసపు పాటగా ప్రసారమైంది. 1995లో వీరు రచించిన ''మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి'' అన్న గీతం సామూహిక గేయశిక్షణకార్యక్రమానికి జాతీయస్థాయిలో ఎంపికై ఆ ఏడాది సెప్టెంబర్‌ మాసంలో దేశంలోని అన్ని రేడియో కేంద్రాల నుండి ప్ర సారమైంది. గతంలో మద్రాసు ఆకాశవాణి నుండి దాశరథి గారి గీతం ఇలా ప్రసారమైంది.

1966 నుండి 1971 వరకు రచించిన గీతాలను 'కనరా నీ దేశం' శీర్షికన 1971లో తొలి లలితగేయసంపుటిగా వెలువరించారు. 1981లో 'రాగరథం' శీర్షికన ప్రగతి, ప్రకృతి, ప్రణయ, ప్రస్తుతి, ప్ర బోధములనే ఐదు విభాగాలతో 100 గీతాలతో లలితగేయసంపుటి ప్రచురించారు.

సినీ గీతాల అరవిరి

ఆకాశవాణిలో ప్రసారమయ్యే లలితగీతాలను విన్న సంగీత దర్శకుడు టి. చలపతిరావు గారు సినిమాలకు పాటలు రాస్తే రాణిస్తావని సూచించి, బహుముఖప్రజ్ఞాశాలిని భానుమతి గారిని కలవమని చెప్పారు. తన కావ్యాలను, గేయాలను చూపించి వారి ఆశీస్సులందుకోవాలని, వడ్డెపల్లి గారు 1979, మేలో చెన్నై చేరుకొని, భానుమతి గారికి ముందుగా తన రచనలు పంపించి, బయటనే వెయిట్‌ చేశారు. ఆమె ఓ గంట పాటు ఓపికతో పరిశీలించి, లోనికి పిలిచి ''ఏదో భావగీతాలు రాసి మా మొహాన పడేయడం కాదు, పాటలు రాయడం అంటే.. ట్యూన్‌కు రాయాలి!'' అని దాదాపు ఆదేశించారు. అప్పుడు 'రచయిత్రి' అనే చిత్రాన్ని ఆమె నిర్మిస్తున్నారు. ఆ చిత్రంకోసం ఓ ట్యూన్‌ వినిపించింది. కల్యాణిరాగంలో కమనీయంగా పాడిన ట్యూన్‌కు.

నీవే లేని ఈ జీవితమే కలయై కరిగెనులే...

నాలో కలతై మిగిలెనులే...

అని పల్లవి రాశారు. భానుమతి గారు సంతోషించి మిగతా చరణాలను పూర్తి చేయించి, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించి రికార్డు చేశారు. కానీ చిత్రాన్ని మాత్రం విడుదల చేయలేదు.

'రచయిత్రి' నిర్మిస్తున్న సమయంలోనే భానుమతిగారు 'ఒకనాటి రాత్రి' డబ్బింగ్‌ చిత్రానికి పాటలు రాయించారు. తమిళం నుండి ఎలా అనువదించాలో కొన్ని మెలకువలు కూడా చెప్పారు.

కొండపల్లి బొమ్మను నేను

బొండుమల్లి రెమ్మను నేను

అని తెలుగుతనం పరిమళించే విధంగా రాశారు.

డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారి ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారిని పరిచయం చేసుకొని, సినీ రచన పట్ల తన ఆరాటాన్ని, తను చేసే ఒంటరి పోరాటాన్ని వినయంగా వివరించగా, అన్నపూర్ణ స్టూడియో వారి రెండో చిత్రం 'పిల్ల జమీందార్‌'లో అవకాశమిచ్చారు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు.

చక్రవర్తిని బీట్‌ ప్రధానంగా కాకుండా మెలొడీ ట్యూన్‌ ఇవ్వాల్సిందిగా అక్కినేని సూచించారు. ఆ వరసకు సరసంగా రాసిన గీతం:

నీ చూపులోన విరజాజి వాన

ఆ వానలోన నేను తడిసేనా... హాయిగా...

నీ నవ్వులోన రతనాల వాన

ఆ నవ్వులోన మేను మరిచేనా తీయగా...

అన్న పల్లవితో రాసిన పాటను బాలు, సుశీల, శైలజ త్రిగళగీతంగా పాడారు. 21.9.80న 'పిల్ల జమీందార్‌' విడుదలై విజయవంతంగా ఆడింది. ''వెన్నెల పరదాలు, వన్నెల సరదాలు'' వంటి పదబంధాలతో సాగిన ఈ పాట, ఆ సంవత్సరపు హిట్‌ సాంగ్‌ గా నిలవడం విశేషం.

రచయిత, దర్శకుడు గిడుతూరి సూ ర్యంగారు 'అమృతకలశం' (1981) చిత్రం కోసం 'జావళి' రాయించారు.

సిగ్గాయె సిగ్గాయెరాస్వామీ

బుగ్గంత ఎరుపాయెరా.. అన్న జావళిని రమేశ్‌నాయుడు

ఖరహరప్రియ, సుతిమెత్తని స్వరాలతో స్వరపరచగా సుశీల శృంగారరసోద్దీపకంగా ఆలపించారు. ''లలితరాగ నవపల్లవాధరము సతత మందించగా'' వంటి వ్యక్తీకరణతో సాగిన ఈ గీతం ప్రాచుర్యంలోకి రాని మధురాతిమధురగీతం. సముద్రం శ్రీశ్రీ, సినారె, తదుపరి 'జావళి' రచించిన 'పాళీశ్వరుడు'వడ్డెపల్లి.

పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన వెంకటేశ్వరరావు గారు వడ్డెపల్లిని, కవిత్వంలో కొత్త మెరపులు కోరుకొనే అభిరుచి గల నిర్మాత, సాహితీవేత్త, ఏ.ఎం. రత్నంగారికి పరిచయం చేశారు. అప్పటికీ 'యుగకర్తలు, పెళ్ళిళ్ళోయ్‌ పెళ్ళిళ్ళు' చిత్రాలకు వడ్డెపల్లి పాటలు రాశారు. వీరి రచనల్లో గల వైవిధ్యాన్ని గుర్తించిన రత్నంగారు, 'పెద్దరికం' (జగపతిబాబు, సుకన్య) చిత్రంలో అవకాశం ఇచ్చారు. కోటిగారు యిచ్చిన ట్యూన్‌కు..

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే..

ఆశల రెక్కలు హంసలు పల్లకి మోసుకుపోవలెనే..

అని రాశారు. 'యమన్‌' రాగంలో కొన్న స్వరాలు తీసి, 'హంసనాదం' స్వరాలతో శ్రావ్యంగా సాగిన ఈ గీతాన్ని, చిత్రబృందం మనోజ్ఞంగా పాడారు. స్వర్గీయ సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతసాహిత్యాలను ప్రశంసించారట.

ప్రతి కవికి కొన్ని శబ్దాల పట్ల ప్రీతి వుంటుంది. వడ్డెపల్లి గారి గేయసాహిత్యాన్ని పరిశీలిస్తే వారు 'మబ్బులంటేనే ఉబ్బితబ్బిబ్బవుతారని తెలుస్తుంది. నీరదాల పరదాల నిలిచిన రేరాజ/ గగనేందిర గళమందున ఎగిరే జలహారమా/ వంటి అభివ్యక్తులతో వరుణ రాగాన్ని ఆలపించారు.

మేఘంలా మనిషి మమతను వర్షించాలి.

మానవత్వబీజాలను మహిలో పండించాలి! అని అంటారు. వరిపొలాలలో జలాలను, కవి కలాలలో మృదుపదాలను ఉత్తేజపరిచేది మేఘమనే వారి భావన...

ఈ సినీగీతంలో వాడిన 'మబ్బుల పల్లకి' పదాన్నే తన సినీగీతాల సంపుటికి శీర్షికగా పెట్టుకోవడం గమనించవచ్చు. స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, తమ తొలి సినీగీత సంపుటిని 'మేఘమాల'తో వెలువరించారు.

'సంకల్పం' (జగపతిబాబు, గౌతమి) చిత్రంలో కూడా ఏ.ఎం. రత్నంగారు వడ్డెపల్లి గారితో 'కురిసింది వానా వానా జల్లు కోరగా' అనే ఓ వాన పాటను రాయించారు. ఈ పాటలో ''కరిమబ్బు లు పయనించగా మది నెమలి ఆడిందిలే'' అని ఉల్లేఖించారు. కీ|| శే|| రాజశ్రీ గారి ఈ పాటను విని మెచ్చుకున్నారట. వారి 'కురిసింది వాన' పాటందించిన స్ఫూర్తితోనే వీరు రాశారు.

ఆ తరువాత 'పిడికెడు ఆకాశం, దిగ్విజయం, అందరూ అందరే, ఏంటి బావా మరీను, వార్నింగ్‌, అనుమానం మొగుడు, మా ఊరి కిట్టయ్య, పిలిస్తే పలుకుతా, లీడర్‌, సంకల్పం, జై బాలాజీ, ఉషాకిరణాలు, అమ్మో పోలీసోళ్ళు' మొదలైన చిత్రాల్లో శతాధిక గీతాలు రాశారు.

శుభాకర్‌, పూర్ణిమల తొలి చిత్రం 'పిడికెడు ఆకాశం'కు ఎస్‌.డి. లాల్‌ గారు అవకాశం ఇచ్చారు. ''పగలే చుక్క పొడిచెరో, వెలుగులే చేతి కందెరో' 'అందితే ఆకాశం పిడికెడు' పాటలు రాశారు. తెలంగాణ ప్రాంతంలో ఆకాశాన్ని 'మొగులు' అంటారు. ఈ పాటల్లో డబ్బు వాదం గమనించదగ్గది.

చందమామ విజయావారి 'భైరవద్వీపానికి' దర్శకత్వం వహించిన సింగీతం, ఆ చిత్రంలో ''అంబా శాంభవి భద్రరాజగమనా!'' అన్న భక్తిగీతాన్ని రాయించారు. పల్లవి శార్దూలంలో మొదలైనట్లనిపించినా, ఆ తరువాత తేలిక పదాల్లోని భక్తిదీపంగా వెలుగుతుం ది. మాధవపెద్ది సురేశ్‌ స్వరకల్పనలో జానకి ఎంతో కరుణ రసాత్మకంగా పాడారు.

'ఏంటి బావా మరీను'లో విద్యాసాగర్‌ స్వరపరచిన వీరి ''ఆకుచాటు పిందే'' కూడా మెలొడీ సాంగ్‌.

'పెళ్ళిళ్లోయ్‌ పెళ్ళిళ్ళు' చిత్రంలో తనపై చిత్రించిన ''నాదము నువ్వే'' గీతకర్త వడ్డెపల్లి గారని తెలుసుకొన్న నటుడు నరేశ్‌, 'మొగుడు పెళ్ళాల దొంగాట' (దర్శకత్వంవిజయనిర్మల) లో అవకాశాలిప్పించి ప్రోత్సహించారు. ఇందులో అన్ని 'లఘువులతో'నే పాట రాశారు.

'ఉషశ్రీ' వారు 2001లో 'ఓ మారియా' క్రైస్తవచిత్రంలో తొలిసారిగా అన్ని పాటలు (సింగిల్‌ కార్డుగా) రాసే అవకాశం ఇచ్చారు. 'మారియా' బుద్ధుని కాలంలో ఆమ్రపాలి వంటిది. ఇందులో పాటలను ఉష, రాజేశ్‌ పాడారు.

విజయచందర్‌ నిర్మించిన 'పిలిస్తే పలుకుతా'లో సాయిబాబాపై చక్కని గీతాన్ని రచించారు.

'పోలీసు కర్తవ్యం, గూఢచారి నెం.1, ఏజెంట్‌ అమర్‌ ఇన్‌ సౌండ్‌ కాండ్‌ మొదలైన అనువాదచిత్రాల్లో పాటలు రాసిన వడ్డెపల్లిగారు, పలు బుల్లితెర సీరియల్స్‌కి థీం సాంగ్స్‌, టైటిల్‌ సాంగ్స్‌ రాశారు. కొన్ని చిత్రాలకు మాటలు, పాటలు, కో-డైరెక్టర్‌గా కూడా చేశారు.

శ్రీ వద్దిరాజు లత ప్రసాద్‌ నిర్మించిన 'భక్తకవి పోతన' (సప్తగిరి ఛానెల్‌1998) కథ, మాటలు, పాటలు రాసి, కోడైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీ పి.వి. మనోహర్‌రావు నిర్మించిన 'భారతీయసం స్కృతీశిఖరాలు, కొండ పిడుగు, అమృతకలశం, వెన్నెల కాపురం, అతిథి, మంచు తెరలు,' మొదలైన టెలీ ఫిల్ములకు రచన, సహ దర్శకత్వం చేశారు. 'వేములవాడ రాజరాజేశ్వరమహాత్మ్యం' టెలీ ఫిల్ముకు రచన, దర్శకత్వం చేశారు. దాదాపు (30) ప్రైవేటు ఆడియో ఆల్బమ్స్‌కు పాటలు రాశారు. 'కరీంనగర్‌ క్షేత్రాలు, అందుకో మారుతి, శ్రీ వేంకటేశ్వరవైభవం, శరణం శబరీశ, అష్టలక్ష్మీవైభవం, కీసర కీర్తన, నమో వెంకటేశ, హనుమద్గానం, ఓం నమశ్శివాయ, హరిహరక్షేత్రాలు' మొదలైన వాటిలో బాలు, జేసుదాసు, వాణీజయరాం, శైలజ, నాగూర్‌ బాబు పాడారు. 'శివపార్వతి స్తుతిమాల'ను డాక్టర్‌ బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

ఇవే కాకుండా యువతరం కోసం, 'లోలక్‌ డోలె తప్పి', 'హై టెక్‌ లవ్‌' వంటి వెరైటీ క్యాసెట్స్‌కు రాశారు. పల్లెమనసు (జానపదం) చిరు ఓ చిరు (పాప్‌) మొదలైనవి వీరి వైవిధ్యరచనలే.

'ఇందిరమ్మ క్రాంతిపథం, విభిన్న ప్రతిభావంతులు, తెలుగు భారతి, ఆటా' (అమెరికా తెలుగు సంఘం) వారి స్వాగతగీతంకూడా రచించి సన్మానితులయ్యారు. సంగీతనృత్యరూపకాలల్లో 'ఆమ్రపాలి, రామా 2 రామం, కవి కల్యాణం' ముఖ్యమైనవి. 'చాణక్య, మాతృదేవత, పునరపి, మహాకవి కాళిదాసు, ఆత్మయాత్ర, వైకుంఠపాళి' మొదలైన సీరియల్స్‌ (ఈటివి, జెమిని, మా టివి) కూడా రాశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రుడు మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి వైభవానికి 30 ఎపిసోడ్‌లకు రచన, సహదర్శకత్వం బాధ్యతల నిచ్చారు.

బుల్లి తెరకు, వెండి తెరకు విస్తృతరచన చేస్తూ సాహితీయజ్ఞా న్ని నిర్వహిస్తున్న వడ్డెపల్లి గారు పొందిన బిరుదులు, సత్కారాలు కూడా విలువైనవి. ఘంటసాల కళాపీఠం మచిలీపట్నం వారి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పురస్కారం (1989), సాహితీ గౌత మి కరీంనగర్‌ వారి సినారె పురస్కారం (1996), ఆంధ్రమహిళాసభ వారి దేవులపల్లి పురస్కారం పొందారు. వరుసగా మూడుసార్లు 'రాష్ట్రపతి'గా (1987, 1992, 94) లో ఎన్టీ రామారావు, ఎన్‌. జనార్దనరెడ్డి, విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడులచే సన్మానం పొందారు. 1996లో నాటి ప్రధాని వాజ్‌పేయి గారు 'ప్ర బోధకవి'గా సత్కరించారు. అమెరికన్‌ తెలుగు సంఘం వారు 'లలితశ్రీ' బిరుదుతో (2004) సత్కరించారు. ఈ సత్కారాల కన్న వేములవాడ రాజరాజేశ్వరదేవస్థానం వారు వెండి పలకపై 'గేయకిరీటి' అని బిరుదునిచ్చి (1995) సత్కరించడం, తన జీవితంలో పొందిన మధురానుభూతి అని భావిస్తారు. పియుసి తర్వాత, బి.ఏ., ఎం.ఏ, ప్రైవేటుగానే చదివిన వడ్డెపల్లిగారు 'తెలుగులో లలితగీతాలు' అన్న అంశంపై విశేషపరిశోధన చేసి (ఉస్మానియా విశ్వవిద్యాలయం) 1998లో డాక్టరేట్‌ పట్టా పొందారు. ఈ పరిశోధనను ప్రశంసించిన, ప్రోత్సహించిన బాలుగారికే ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు. లలితగీత ప్రారంభ-వికాస-పరిణామాలు తెలుసుకొనగోరేవారికి ఈ గ్రంథం ఓ కరదీపిక.

అంతర్జాతీయ బాలలచిత్రోత్సవంలో క్రిటిక్‌ జ్యూరీ సభ్యుడుగా (2003) నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్క్రిప్టు ప్యానెల్‌ సభ్యుడుగా కూడా వ్యవహరించిన వడ్డెపల్లి, తను పని చేసిన తపాలాశాఖలో ఇన్యూరెన్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా వరుసగా ఏడు సార్లు బంగారు పతకాలను పొందారు. ఆరుద్ర 'కూనలమ్మ పదా లు' శ్రీశ్రీ ప్రాసక్రీడలు, వెన్నెలకంటి 'వెన్నెలమ్మ' పదాలు సృష్టించినట్లే వడ్డెపల్లి 'ఆటవెలది' ఐదు సూర్యగణాలతో 'పాటవెలదు'లను ఆధునికసామాజికాంశాలతో అందంగా రాస్తున్నారు.

రచన నుండి దర్శకత్వపథానికి

''శిశిరమందు గూడ శిరసు నెత్తి

ఎర్రకొడవలి వోలె ఎన్నొ పూల

మోసులెత్తి పూయు మోదుగుయిల

జ్వలితక్రాంతి హృదయదళిత వోలె''

వంటి 'పాటవెలది' కేవలం ఉదాహరణ మాత్రమే.

తెలుగు సినీ సరస్వతిని పాటల మందారాలతో నిత్యం సమర్పించే వడ్డెపల్లి గారి పూర్తి పేరు డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ. సినీ రచయితలు దర్శకత్వశాఖను చేపట్టిన సందర్భాలు చాలా తక్కువే. గతంలో సముద్రాల, ఆత్రేయ, రాజశ్రీ, వీటూరి, పాలగుమ్మి పద్మరాజు, నేడు త్రివిక్రమ్‌, పోసాని మురళికృష్ణ వంటి వారు కనిపిస్తారు. రచన, దర్శకత్వం తనకు జోడు గుర్రాల స్వారీ కాదని, ఉచ్ఛ్వాసనిశ్వాసాలని, ఆత్మవిశ్వాసంతో తెలుపుకున్నారు. కమలాకర కామేశ్వరరావు గారి వలె అన్ని రకాల చిత్రాలకూ దర్శకత్వం వహించాలన్నది తన కోరిక అంటారు. కో-డైరెక్టర్‌గా పని చేసిన అనుభవంతో అక్షిత బాలాజి క్రియేషన్స్‌ వారి 'ఎక్కడికెళ్తుందో మనసు' (2005) చిత్రానికి రచన చేసి, దర్శకత్వం వహించి తన ఇన్నింగ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం యువతకు సంబంధించిన మరో చిత్రకథారచన చర్చల్లో ఉన్నారు.

సినీరంగంలో 'గాడ్‌ ఫాదర్లు' లేకున్నా 'బ్యాడ్‌ ఫాదర్లు' ఉండకూడదనే వడ్డెపల్లి గారి మాటల్లో, మూడు దశాబ్దాల సినీ జీవనప్రస్థానంలో ఎదురైన ''అమృతకలశాలు, హాలాహలాలు'' ధ్వనిస్తుంటాయి.

'బుల్లి తెర వెండి తెర'లకు తాను రచించిన పాటలను 'మబ్బుల పల్లకి'గా ఈ నెల 18వ తేదీన వెలువరిస్తున్న వడ్డెపల్లిగారు, సినీరంగంలో సిరిమల్లెగా పరిమళించి పరిఢవించాలని, తెలుగు రసజ్ఞలోకం ఆశిస్తూంది.

డాక్టర్‌ వొద్దిరాజు వెంకటరామారావు

98492 37663

(మే 18నడాక్టర్‌ వడ్డెపల్లి కృష్ణ 'మబ్బుల పల్లకి' ఆవిష్కరణ సందర్భంగా)

డాక్టర్‌ వడ్డెపల్లి కృష్ణగారి కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు

1. నీ చూపులోన.. (పిల్లజమీందార్‌),

2. సిగ్గాయె సిగ్గాయె.. (అమృతకలశం),

3. చెలీ నీ చూపె... (దిగ్విజయం),

4. ఆకు చాటు.. (ఏంటి బావా మరీను),

5. ముద్దుల జానకి... (పెద్దరికం),

6. దివి నుండి.. (పిలిస్తే పలుకుతా),

7. ఏదో కోరిక... (లీడర్‌),

8. గోవిందా హరి.. (అమ్మో పోలీసోళ్ళు),

9. నాదం నువ్వే... (పెళ్ళిళ్ళోయ్‌ పెళ్ళిళ్ళు),

10. ధర్మోరక్షతి.. (జై బాలాజి)

'సంకల్పం' (జగపతిబాబు, గౌతమి) చిత్రంలో కూడా ఏ.ఎం. రత్నంగారు వడ్డెపల్లి గారితో 'కురిసింది వానా వానా జల్లు కోరగా' అనే ఓ వాన పాటను రాయించారు. ఈ పాటలో ''కరిమబ్బు లు పయనించగా మది నెమలి ఆడిందిలే'' అని ఉల్లేఖించారు. కీ|| శే|| రాజశ్రీ గారి ఈ పాటను విని మెచ్చుకున్నారట. వారి 'కురిసింది వాన' పాటందించిన స్ఫూర్తితోనే వీరు రాశారు.

ఆంధ్ర సాహిత్య చరిత్రపై అరుదైన ముద్ర ఆరుద్ర

ఆంధ్రసాహిత్యచరిత్రలో ఒక అపూర్వమైన, అరుదైన సంఘటన, ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, ఒక ఇతిహాసంగా రూపొందడం. కవి, విమర్శకుడు, సాహిత్యచరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి, అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం. ఒక సాహిత్య సాంస్కృతికసుదర్శనం. అభ్యుదయకవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు.

''తరానికో వంద కవులుతయారవుతారెప్పుడూ

వందలోనూ మందలోనూమిగలగలిగేదొక్కడు''

అనే ఆరుద్ర మాటల్లోనే అభ్యుదయకవిత్వోద్యమంలో నిలదొక్కుకుని ఆ తరంలో మిగలగలిగిందీ, విశ్వరూపం దాలిచిందీ తానొక్కడే అని ఆరుద్రపై పరిశోధన చేసిన ఆర్‌. నరసింహారావు తన సిద్ధాంతగ్రంథం 'అభ్యుదయకవిత్వం-ఆరుద్రత'లో పేర్కొన్నాడు. ఆరుద్ర అభ్యుదయవాది, సామ్యవాది, ప్రయోగవాది, కమ్యూనిస్టు, మార్క్సిస్టు దృక్పథం ప్రగతిపథంలో నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా ప్రయోగదృష్టితో కవిత్వం వ్రాశాడు.

అభ్యుదయకవిత్వానికి ఆదిరుద్రుడైన శ్రీశ్రీ, ఆరుద్రను ఆరో రుద్రుడుగా పేర్కొన్నాడు. శ్రీశ్రీ తర్వాత వెంటనే మ్రోగే పేరు ఆరుద్రదే కావడం వల్ల, అతడు రెండో రుద్రుడు. శ్రీశ్రీ చిరునామాయే తన చిరునామాగా జీవించిన ఆరుద్ర, శ్రీశ్రీ ప్రభావం నుండి బయటపడటానికి అన్ని మార్గాలనూ అన్వేషించాడు. తనపై శ్రీశ్రీ ప్రభావం కంటె పఠాభి, నారాయణబాబుల ప్రభావమే ఎక్కువ అంటాడు ఆరుద్ర. ''ఆరుద్ర కవితాజగత్తులోకి అడుగుపెట్టిన తరువాత శబ్దాలకు గల వింత వింత జిలుగులు, రంగుల స్ఫురణకు ప్రాముఖ్యత వచ్చింది'' అని ఆరుద్ర పదప్రయోగవైచిత్రికి యోగ్యతాపత్రాన్నిచ్చాడు శ్రీరంగం నారాయణబాబు. అంత్యప్రాసలే ఆరుద్ర చేవ్రాలుగా నిలిచాయి.

''కవిత కోసం నేను పుట్టాను కాంతి కోసం కలం పట్టాను'' అని ఆరుద్ర నవ సమాజనిర్మాణానికి కృషి చేశాడు. ఆరుద్ర 'త్వమేవాహమ్‌' (నీవే నేను), నైజాం పరిపాలనలో ప్రజల కడగండ్లకు సజీవదర్పణం. 'సినీవాలి'లో మధ్యతరగతి మనస్తత్వనాటకీయత, 'ఇంటింటి పజ్యాల'లో హృదయం జల్లుమనే తటిల్లత, ఏటికేడాదిలో సమకాలీనసమాజంలో మార్పు తేవాలనే తపన, కూనలమ్మ పదాలలో వేమన తాత్వికచింతన, పైలాపచ్చీసులో వైచిత్రిప్రియత్వమూ విశ్వరూపదర్శనమిచ్చి, పఠితల హృదయవీణాతంత్రులను మీటుతాయి.

నెల కొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆరుద్ర, గేయాలు, కథలు, నవలలు, గేయనాటికలు, సాహిత్యపరిశోధకవ్యాసాలు, కవితలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు, అనువాదాలు, సినీ గీతాలు, సమగ్ర ఆంధ్రసాహిత్యసంపుటాలు, మొదలైన రచనలు ఆయన వాఙ్మయవైవిధ్యాన్ని విస్తృతిని తెలియజేస్తాయి. శ్రీశ్రీ తన గేయాలను ఆవేశంగా కనుల ముందు బొమ్మ కట్టిస్తే, ఆరుద్ర తనగేయాలను ఆలోచనతరంగాలుగా కంపింపజేస్తాడు. శ్రీశ్రీ ముద్ర వేరు, ఆరుద్ర ముద్ర వేరు. ఎవరి పాదముద్రలు వారివే. శ్రీశ్రీ శబ్దాలంకారాల ఢమరుకనాదాలతో మహేంద్రజాలమాయాపురిని సృష్టిస్తే, పాఠకుల పరిధిలోకి రాని ప్రతీకలతో అర్థం కాని భావచిత్రాలతో నారికేళపాషాణపాకాలను తయారుచేస్తాడు ఆరుద్ర. అభ్యుదయకవి అయినా కొత్త పోకడల చాపల్యం, ఆరుద్ర కవితకు ఘూర్జటీవధూటి నిగూఢత్వాన్ని కలిగించింది.

''ఆరుద్ర తన ఛందస్సుల చేత అందం గా చాకిరీ చేయించుకోగలడు... శుద్ధవచనం రాస్తున్నా దాని గమనంలో ఒక వేగం సాధించగలడు'' అని శ్రీశ్రీ, ఆరుద్ర రచించిన 'త్వమేవాహమ్‌'కు వ్రాసిన పీఠికలో ఆరుద్ర కవిత్వాన్ని మెచ్చుకున్నాడు. రైలులో ఒక స్త్రీ, ప్రయాణికుల ముందు నగ్నంగా నిలబడి, ''రజాకార్ల చేతిలో దోపిడీకి గురైన నాకు సిగ్గెందుకు'' అన్న వార్త, ''నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది'' అనే శీర్షికతో కృష్ణాపత్రిక 1948 జూలై 10వ తేదీన ప్రచురించినదాన్ని చదివి ఆరుద్ర తీవ్రంగా చలించాడు. ఆ ఆగ్రహమే తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో వెలువడిన 'త్వమేవాహమ్‌' (నువ్వే నేను) కావ్యానికి కారణమై, ఆరుద్ర తెలంగాణ ప్రజానీకంతో ఏకత్వాన్ని ప్రకటించడానికి తోడ్పడింది. తొలుత ఆరుద్ర కావ్యానికి తెలంగాణ పేరు పెడితే 'త్వమేవాహమ్‌' అనే శీర్షిక ఉచితంగా ఉంటుందని ఆ విధంగా మార్చాడు శ్రీశ్రీ. మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబించిన ఈ కావ్యంలో, కాలాన్ని ప్రవాహంలా భావిస్తూ దానిని పర్వతదశ, ఉపనదులు, ప్రవాహ దశ అని మూడు దశలుగా దర్శించాడు ఆరుద్ర.

'త్వమేవాహమ్‌' కావ్యంలో గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు, కాలానికి సమాజానికి సంబంధించిన ప్రతిభావంతమైన ప్రతీకలుగా మలచబడ్డాయి. కాలానికి సంకేతమైన 'గడియారం' ఈ సమాజానికి ప్రతీక అయితే, గంటలు పెట్టుబడిదారులు, శ్రీమంతులు, నిమిషాలు మధ్యతరగతిప్రజలు సామాన్యులు, సెకండ్లు అడుగు జనం. చిన్నముల్లు పైతరగతి మనస్తత్వానికి చిహ్నమైతే పెద్ద ముల్లు మధ్యతరగతి స్వభావానికి, సెకండ్ల ముల్లు శ్రామికవర్గసిద్ధాంతాలకు ప్రతీకలు. త్వమేవాహమ్‌ కావ్యమూలాలు తెలంగాణ ఉద్యమక్షేత్రంలో ఉన్నాయి. నిజాం నిరంకుశపాలనలో దుర్భరజీవితా న్ని గడుపుతున్నారు ప్రజలు.

''నీ చైతన్యంఅరముగ్గిన అవకాశంచిరంజీవి మానవుడా త్వమేవాహమ్‌'' అంటూ ఆరుద్ర, చిరంజీవి మానవునిలో మమేకం అయ్యాడు. ఒక వైపు నిజాం నవాబుతోనూ, మరోవైపు భూస్వాములతోనూ, పోరాడుతున్న సామాన్యరైతు చిరంజీవితో, ఆరుద్ర, 'త్వమేవాహమ్‌' అవడం అతని అభ్యుదయదృక్పథానికి నిదర్శనం. 'త్వమేవాహమ్‌' రచనతో ఒక కవిగా గుర్తింపు, చిరునామా లభించాయి, ఆరుద్రకు.

కవిత్వం ప్రయోజనం కోసం కావలసిన నూతనదృక్పథంపై శ్రీశ్రీ, అబ్బూరి వరదరాజేశ్వరరావుతో కలసి ఆరుద్ర చేసిన దీర్ఘమైన చర్చల ఫలితంగా, కవిత్వం పట్ల ఆరుద్ర ఏర్పరచుకున్న నిర్దుష్టమైన అభిప్రాయాలకు అక్షరరూపమే 'సాహిత్యోపనిషత్‌' అనే లక్షణకావ్యం . కవిత్వానికి మూల బీజాలు సమాజంలోనే ఉంటా యి. ఉత్తమ కవిత్వం ఎప్పుడూ గాయాల్లోంచే పుడుతుంది. గాయపడిన మనసులను ఊరడిస్తూనే ఉంటుంది. ఆరుద్ర ఆ కావ్యంలో కవితాతత్వాన్ని మానిషాద శ్లోకం లోంచి దర్శించాడు.

''ఎప్పుడో మానిషాదలో పుట్టిందట మొదటి కవిత్వం

ఎప్పుడైనా అలాంటి ఘటనతో పుట్డడమే దాని తత్వం

అక్రమం జరగడం కవితకు నాందనేది ముఖ్యం''

కవిత్వంలో వస్తువుకి, శిల్పానికి సమానమైన ప్రాధాన్యం ఉంది. ఒకటి లేకుండా రెండోది కవిత్వం కాదు. అందుకే వస్తువు, శిల్పం రెండూ కవిత్వమనే శకటానికి రెండు చక్రాలని ఇలా చెప్పాడు ఆరుద్ర.

''ఏమిటి చెప్పడం ఎలా చెప్పడం

అనేవి రెండు రెండు చక్రాలు

ఈ రెండు సమంగా ఒప్పడం బండిని తిప్పడం''

మధ్యతరగతి స్వప్నానికి అక్షరరూపం 'సినీవాలి' కావ్యం. అది మధ్యతరగతి మనస్తత్వానికీ, నగరజీవితానికీ నిలువుటద్దం. సినీవాలి అంటే అమావాస్య రేయి చంద్రరేఖ అని అర్థం. జీవనవిభావరిలో అతి సన్నని వెలుగు రేఖను దర్శింపజేస్తుందీకావ్యం. 'నేడమావాస్య'తో మొదలై 'ఇది సినీవాలి' అనే మాటతో ముగియడం కవి ఆశావహదృక్పథాన్ని సూచిస్తుంది. నిరాశా నిస్పృహలనే చీకట్లను చీల్చుకుని చిన్న ఆశ అనే వెలుగు రేక ఉదయిస్తుంది. 'సినీవాలి'లో కథానాయకుడు మధ్యతరగతి జీవితానికి ప్రతినిధి. స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటూ ఎప్పుడూ సంకెళ్లతోనే జీవిస్తుంటాడు. వెలగవలసిన జీవితం చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు, మనసు నిండా నిరాశ పేరుకున్నప్పుడు, దానిని ఛిన్నాభిన్నం చేయడానికి ఒక చిరుదీపాన్ని అయినా వెలిగిస్తే చాలు అనే ఆశాజనకమైన సందైశాన్ని 'సినీవాలి'లో ఆరుద్ర అందించాడు.

జానపదకళారూపాలైన 'కూనలమ్మ పదాల'లో వస్తువైవిధ్యంతో కూడిన వర్తమానసామాజికజీవితంలోని వైరుద్ధ్యాలను ఆవిష్కరించాడు ఆరుద్ర. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, పాఠకుడి హృదయంలోకి దూసుకుపోయేలా, ఎలా చెప్పాలో అతనికి బాగా తెలుసని నిరూపిస్తాయి కూనలమ్మ పదాలు. ప్రేమతత్వాన్ని గురించి, శృంగారరసాన్ని గురించి, మతమౌఢ్యం గురించి, స్త్రీవాదభావాల గురించి చెబుతూ, కూనలమ్మ ఆత్మని సాక్షాత్కరింపజేశాడు ఆరుద్ర.

సగటు మనిషి తన జీవితంలోకి తొంగిచూసుకుంటే ఎలా ఉంటుందో చిన్న చిన్న సంఘటనల ద్వారా తెలియజేసే హాస్యకవితలు ఆరుద్ర 'ఇంటింటి పజ్యాలు.' వీటిలోని వస్తువు అందరికీ అనుభవైకవేద్యం. హృద్యమైన ఈ పద్యాలు కవిలోని హాస్యప్రియత్వానికి నైవేద్యాలు. సామాన్యమైన వస్తువుతో చమత్కారంతో నిత్యనూతనత్వాన్ని ధ్వనిస్తూంటాయి కవితలు. పైలాపచ్చీసు కవితాసంకలనం వస్తువు భాష, అభివ్యక్తి, దృక్పథాల అపూర్వసమ్మేళనం.

'ఏటికేడాది' కవితలలో భారతీయలౌకిక దృక్పథానికి పట్టుకొమ్మ అయిన మతసామరస్యం, స్వాతంత్య్రం వచ్చి చాలా కాలమైనా వీడని దారిద్య్రపు నీడలు మొదలైన సామాజికసమస్యలు దర్శనమిస్తాయి. సమాజం అనే రంగస్థలంపై తెర మరుగైపోయిన స్త్రీ స్థానం, స్త్రీ భాగస్వామ్యం,త్యాగఫలం సఫలం కావాలంటే, గతాన్ని స్మరించక తప్పదు-అని చెబుతుంది ఆరుద్ర అసంపూర్ణరచన స్త్రీ పురాణం. అనాదిగా స్త్రీ జీవితం ఆలోచనవిధానం, మానసికవికాసం-అన్నింటినీ క్రమబద్ధంగా దీనిలో చర్పించడమైంది.

కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారి ప్రేరణతో, ఆధునికసమస్యలను ఆధునికమైన పోకడలతో, ఆరుద్ర 'శుద్ధ మధ్యాక్కరలు'లో అభినివేశింపజేశాడు. ఈ నాటి ఆడపిల్లల తండ్రుల అవస్థని ఇలా వర్ణిస్తాడు

''కన్యకల పరిణయసమస్య

కారునల్లని అమావాస్య

మాన్యాలపై అప్పు తెచ్చి

మ్యారేజి చేయడం పిచ్చి

అన్యాయమీ శుల్కమనుచు

అడగడం తెగ పాపమనుచు

అన్యులకు తాను బోధించి

ఆశించు కట్నాల సంచి''

అంత్యప్రాసలతో, అక్కడక్కడ ఆంగ్లపదాలతో, సాంఘికనీతిని ఆసక్తికరమైన రీతిలో ఆవిష్కరిస్తాయి, ఈ మధ్యాక్కరలు.

దక్షిణవేదమైన, దుర్భేద్యమైన 'తిరుక్కురళ్‌' తెలుగు అనువాదం, ఆరుద్ర తమిళ ప్రావీణ్యాన్ని తెలియజేస్తుంది. హోచిమిన్‌ 'జైలు గీతాలు' ఆంగ్లం నుండి అనువదించినప్పుడు కూడా కొంచెం స్వేచ్ఛగా అవి స్వతంత్రగీతాలనే భ్రాంతి కలగజేస్తాయి. 'సాలభంజిక, దీర్ఘరాత్రం, తదేవ గృహం' మొదలైన అనేకప్రయోగాత్మకనాటికలు, రేడియో నాటికలు రచించాడు ఆరుద్ర. ఇవన్నీ ప్రదర్శనయోగ్యాలే. 'కాటమరాజు కథ' అనే చారిత్రకనాటకం ప్ర

సిద్ధమైంది. 'దేవుని ఎదుట, రాదారి బంగళా' ప్రయోగాత్మకనాటకాలు. ఆరుద్ర రాసిన డిటెక్టివ్‌ నవలలు, కథలు అనేకం. వాటిలో 'పలకల వెండి గ్లాసు' పేరు పొందింది.

కొన్ని వేల సినిమా పాటలే కాకుండా సినిమాలలో కథ, మాటలు కూడా ఆరుద్ర వ్రాశాడు. 'ఎదగడాని కెందుకురా తొందరా', 'ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలో మమకారం ఎప్పటికీ పోదు' మొదలైన ఆరుద్ర సినీ గీతాలు చిరస్మరణీయాలు. ఆరుద్ర ఇతరరచనలన్నీ ఒక ఎత్తు. 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' సంపుటాల రచన మరో ఎత్తు. ఇంత వరకు వేరెవ్వరూ ఇంతటి బృహత్తరప్రణాళికను చేపట్టే సాహసం చేయలేదని చెప్పవచ్చు. గతంలో వచ్చిన సాహిత్యచరిత్రల విహంగవీక్షణాలు కూడా అసంపూర్ణాలే. ఆధునికయుగాన్ని స్పృశించినవి దాదాపు లేవని చెప్పవచ్చు. ఆరుద్ర సమగ్ర ఆంధ్రసాహిత్యం ఆ నాటి నుండి ఈ నాటి వరకు 'ఆంధ్రసాహితీచరిత్ర' విశ్వరూపసందర్శనం. సులభమైన, సరళమైన వ్యావహారికశైలిలో, యుగవిభజనతో, విస్తృతమైన పరిధితో, ప్రామాణికమైన స్థాయిలో వెలువడిన ప్రథమగ్రంథంగా దీన్ని పేర్కొనవచ్చు. ఆరుద్ర గతంలో 13 భాగాలుగా వెలువరించిన బృహత్‌ గ్రంథాన్ని తెలుగుఅకాడమీవారు 2004లోప్రచురించడం తప్ప, ఏ విశ్వవిద్యాలయం గాని ఇటువంటి కృషికి పూనుకోకపోవడం దురదృష్టకరం!

ఆరుద్ర ప్రకటించిన రచనలు, కావ్యాలు, కవితాసంపుటాలు, అనువాదాలు, పద్యకవిత్వం, నాటికలు, జంట కవిత్వం శ్రీశ్రీ, వరదతో కలసి పరిశోధనగ్రంథం, ఇతరత్రా అన్నీ మొత్తం 40 పైగా ఉన్నాయి.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు సాహిత్యజగత్తులో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్న ఆరుద్రకు, కళాశాల విద్య అంతగా లేకపోవడం నమ్మలేని నిజం! చిన్నప్పుడు పాఠశాలలోనూ తెలుగు చదువుకోకపోవడం మరో విశేషం. భాషాజ్ఞానాన్ని చాలా వరకు స్వయంకృషితోనూ, స్నేహితులు అబ్బూరి వరదరాజేశ్వరరావు, మొదలైనవారి సాంగత్యంలోనూ అలవరచుకున్నాడు ఆరుద్ర.

ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకరశాస్త్రి. జననం 1925 ఆగస్టు 31. తల్లిదండ్రులు వెంకటజోగమ్మ-భాగవతుల నరసింగరావు. ఆరుద్ర ఒక నక్షత్రం పేరు. ఒక పురుగు పేరు కూడా. వర్షకాలంలో నేల పరిచిన పచ్చటి తివాసీలా ఉన్నప్పడు, ఎర్రగా ముఖమల్‌లా మెత్తగా మెరుస్తూ నేలపై నడయాడే అందమైన పురుగు ఆరుద్ర. చిన్నప్పడు ఆరుద్ర కూడా ఆ పురుగులాగే ఎర్రగా, బొద్దుగా, చూడముచ్చటగా ఉంటే, స్నేహితులు అతనికి వెటకారంగా పెట్టిన పేరే స్థిరపడింది. సాహిత్యలోకానికి అతడు ఆరుద్రగానే పరిచయమయ్యాడు. నక్షత్రంగా, నింగి పురుగుగా నేలకి సంబంధం కలుపుతూ సాహిత్య ధ్రువతారగా వెలుగొంది, చివరికి 1998 జూన్‌ 4న తారాపథానికేగాడు. ''నీవు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు'' అనే ఆరుద్ర మాట, అతని అనుభవంలోకి రాకపోవడం ఒక హై లైట్‌!

విజ్ఞానం వెలుగులోకి!

సెక్స్‌ అంటే 'బూతు' కాదు.
సెక్స్‌ అంటే- ప్రేమ, ఆప్యాయత, సాన్నిహిత్యం, పునరుత్పత్తి, పెంపకం,
అంతిమంగా కుటుంబ వ్యవహారమన్న వైఖరి ముఖ్యం.
సెక్స్‌ పట్ల ప్రజల్లో లేనిపోని ఆసక్తి రేకెత్తించటం కాకుండా..
సెక్స్‌ను ఒక ఆహ్లాదకరమైన, బాధ్యతాయుతమైన కుటుంబ వ్యవహారంగా
చూడటం, చూపించటం.. చాలా అవసరం!

మానవ నాగరికత విస్తరిస్తూ.. మనిషి పురోగమిస్తున్న తొలి నాళ్లలో.. సెక్స్‌ పట్ల ఎటువంటి దాపరికాలూ లేని విశాల దృక్పథమే ఉండేది. ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ నాగరికతలన్నింటిలోనూ ఇదే సానుకూల థోరణి ప్రతిఫలించింది. కానీ కాల క్రమంలో.. సెక్స్‌.. ఓ చాటుమాటు వ్యవహారంగా.. బహిరంగంగా మాట్లాడటానికి కూడా వీల్లేని చీకటి తంతుగా మారిపోయింది. ఫలితంగా సెక్స్‌ చుట్టూ ఎన్నో అపోహలు అల్లుకున్నాయి. అజ్ఞానం ఆవరించింది. అరకొర అవగాహన పెద్ద అడ్డుగోడ అయ్యింది. వీటన్నింటినీ ఛేదించటానికి శాస్త్ర రంగానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. సెక్స్‌ను సశాస్త్రీయంగా అర్థం చేసుకుంటూ.. సెక్స్‌ సమస్యలకు సమర్థ చికిత్సలు అందుబాటులోకి తేవటంలో నేటి ఆధునిక వైద్యరంగం అనూహ్య పురోగతి సాధించింది. ఈ గమ్యం.. ఈ పురోగతి.. ఎంతో విజ్ఞానదాయకం! అపోహలు వీగిపోవటానికి ఇదెంతో అవసరం!
మనం ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవైపు- హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కేసుల్లో మిగతా ప్రపంచ దేశాలను దాటిపోయాం. సెక్స్‌ పట్ల అవగాహన అట్టడుగు స్థాయిలో ఉంది. పట్టణాల్లో అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. యుక్తవయసు కూడా రాకముందే చాలామంది లైంగిక కార్యకలాపాలకు దిగుతున్నారు. డబ్బు దండిగా చేతికి అందుతుండటంతో చిన్నవయసులోనే ఉత్సుకత పెరుగుతోంది. టీవీలు, వెబ్‌సైట్లు తేలికగా దారి తప్పిస్తున్నాయి. మరోవైపు- 'సెక్స్‌ సమస్య'లూ పెరుగుతున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులతో మధుమేహం-హైబీపీ విస్తరించిపోతూ.. వీటి ఫలితంగా సామర్థ్య సమస్యలూ అనూహ్యంగా పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమలేని జీవనశైలి ఎందరినో లైంగికంగా కుంగదీస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే మున్ముందు మన దేశం 'ప్రపంచ నపుంసక కేంద్రం'గా మారుతుందన్న హెచ్చరికల్లో అతిశయమేం లేదు. సెక్స్‌ పట్ల మన వైఖరిలో మార్పు రావాల్సిన, అవగాహన పెరగాల్సిన సందర్భమిది!
సరైన లైంగిక విజ్ఞానాన్ని అందించాల్సిన ఇళ్లలో, స్కూళ్లలో, సమాజంలో.. అన్నిచోట్లా సెక్స్‌ను ఒక 'నిషిద్ధ పదం'గా చూస్తుండటం వల్ల అనుమానాలు, అపోహలు రాజ్యమేలుతున్నాయి. వాస్తవానికి సెక్స్‌ విషయంలో ఆధునిక శాస్త్ర రంగం ఎంతో పురోగమించింది. మధ్య యుగాల నాటి చీకటి తెరల్లోంచీ, గుడ్డినమ్మకాల్లోంచీ సెక్స్‌ను బయటకు తెచ్చి.. దాన్ని సశాస్త్రీయంగా అర్థం చేసుకోవటంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధి సాధించింది. ఎన్నో అపోహలు వీడిపోయాయి. ఎన్నో సెక్స్‌ సమస్యలకు ఇప్పుడు సమర్థమైన పరిష్కారాలు, చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ శాస్త్రీయమైన లైంగిక విజ్ఞానం అందరికీ అందటం.. ఇప్పటి కనీస అవసరం.
సమాజంలో సర్వత్రా 'సెక్స్‌' కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఏది సరైన సెక్స్‌? ఏది సురక్షిత సెక్స్‌? ఏది బాధ్యతాయుతమైన సెక్స్‌? అన్న అవగాహన మాత్రం కనీస స్థాయిలో ఉంటోంది. సెక్స్‌ గురించి తెలుసుకోవటంలో, అవగాహన పెంచుకోవటంలో ఎవరికీ అసౌకర్యం ఉండకూడదు. 'లైంగిక విద్య' అన్నది కేవలం ఇంట్లోనో, లేక కేవలం స్కూల్లోనో నేర్పేది కాదు. ఇది చిన్నతనం నుంచీ, అన్ని వైపుల నుంచీ అందాలి. బాధ్యతాయుతమైన లైంగిక విద్య స్కూలు కంటే ముందే.. ఇంటి దగ్గరే ఆరంభమవుతుంది. అది తప్పు ధోరణిలో సాగకూడదు. పిల్లలు జననావయవాలు ముట్టుకోవటం సహజం. వెంటనే మనం 'ఛీఛీ, చెయ్యి తీసై' అనకూడదు. దీనివల్ల పిల్లలు సెక్స్‌ అనేది చెడ్డపని, అపరిశుభ్రమన్న తప్పుడు నమ్మకాల్లో పెరుగుతారు. క్రమేపీ బిడియం, భయాల్లో కూరుకుంటారు. చివరికి తప్పుడు మార్గాల్లో.. తప్పు సమాచారాన్నే ఒంటబట్టించుకుంటారు. సెక్స్‌ విజ్ఞానాన్ని ఇంట్లోనూ, స్కూల్లోనూ కూడా ఆరోగ్యకరమైన ధోరణిలో అందించటం అవసరం. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో పిల్లలకు కేవలం సైన్స్‌ బొమ్మలు చూపిస్తూ.. జబ్బుల గురించి చెబుతుంటే వాళ్లకు ఆసక్తి ఉండదు. సెక్స్‌ అనేది వాళ్ల దృష్టిలో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అంశం. దాన్ని ఆ ధోరణిలోనే.. వైజ్ఞానికంగా చెప్పాలి.

1994: ప్రపంచ ఆరోగ్య సంస్థ 'లైంగిక ఆరోగ్యాన్ని' 'ప్రాథమిక మానవ హక్కు'గా గుర్తిస్తూ ప్రకటన చేసింది. ఇదో గొప్ప మలుపు. అంతకు ముందు సెక్స్‌ సమస్యలకు వైద్యం చేసేవాళ్లను నాటువైద్యులుగా, నకిలీ మోసగాళ్లుగా చిన్నచూపు చూస్తుండేవాళ్లు. మిగతా వైద్యులకుండే గౌరవం వీరికి దక్కేది కాదు. నిజానికి అప్పట్లో అంత విజ్ఞానం, శిక్షణ లేకపోయినా.. సెక్స్‌ సమస్యలను ముఖ్యమైన సామాజిక సమస్యగా గుర్తించి.. దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినందుకు వాళ్లు ఎంతోకొంత అభినందనీయులే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపుతో ఈ పరిస్థితి మారింది.. సెక్స్‌ వైద్యం గౌరవప్రదమైన వ్యవహారంగా ప్రధాన స్రవంతిలోకి వచ్చింది!
  • ఆరాధన: సెక్స్‌ పట్ల 'చిన్నచూపు' అన్నది మొదటి నుంచీ ఉన్నది కాదు, మధ్యలో తెచ్చిపెట్టుకున్నది! ప్రాచీనకాలంలో ప్రతి మానవ నాగరికతలోనూ సెక్స్‌ పట్ల స్పష్టమైన దృక్పథం కనబడుతుంది. గ్రీకు, జపాన్‌ సంస్కృతులతో పాటు మన దేవాలయాల మీది శిల్పాలు, లింగపూజల వంటివన్నీ సెక్స్‌ పట్ల నాటి సమాజంలో ఎటువంటి భేషజాలూ, పట్టింపులు లేకపోవటాన్నే సూచిస్తాయి. అలాగే సంతాన దేవతలు, సామర్థ్య దేవతలను కొలవటం ప్రతి సమాజంలో ఉన్నదే. సెక్స్‌ను 'బూతు'గా చూడటమన్నది తర్వాత్తర్వాతి విపరిణామం.
  • వలస ధోరణి: సెక్స్‌ అన్నది నలుగురిలో మాట్లాడటానికి లేని చాటుమాటు వ్యవహారంగా పరదాల వెనక్కివెళ్లింది ప్రధానంగా పంధొమ్మిదో శతాబ్దం మధ్య.. విక్టోరియన్‌ (బ్రిటీషు పాలనా) కాలంలో! ఈ ప్రపంచ వ్యాప్త ధోరణి.. ప్రత్యక్షంగా బ్రిటీషు పాలనలో ఉన్న మన దేశాన్ని మరింతగా ప్రభావితం చేసింది. అప్పటికే ఒకవైపు 'కామసూత్ర' వంటి సానుకూల వాతావరణం, మరోవైపు సంకుచిత సంప్రదాయాల మధ్య నలుగుతున్న మన సమాజం... ఈ బ్రిటీషు పాలనా కాలంలో పూర్తి గందరగోళంలో పడిపోయింది. సెక్స్‌ పట్ల దాపరికాలు, ద్వంద్వనీతి, లేనిపోని దురభిప్రాయాలన్నీ మొదలయ్యాయి. నేటికీ కొన సాగుతున్న అవగాహనా రాహిత్యానికి బీజాలు ఈ కాలంలో పడ్డవే!
  • అనాది బాధే: పటుత్వాన్ని 'పురుషత్వం'గా, గొప్ప 'సామర్ధ్యం'గా చూసే ధోరణి కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు నపుంసకత్వం, సామర్ధ్య రాహిత్యమన్నది ఆది నుంచీ ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకుని, సమస్య నుంచి బయటపడేందుకు సహకరించే శాస్త్రీయ వైద్యమే లేదు. ఫలితంగా నాటు డాక్టర్లు, వాజీకరణాల్లాంటివే నాడు ఆధారమయ్యాయి. పాశ్చాత్య దేశాల్లో ఖడ్గమృగం కొమ్ములూ, మన ప్రాంతాల్లో ఊరపిచ్చుక లేహ్యాల్లాంటివి లేనిపోని ప్రచారంలోకి వచ్చాయి. శాస్త్రీయమైన అవగాహన కొరవడటంతో.. హస్తప్రయోగం, వీర్యం వంటి విషయాల్లో బోలెడు 'అపోహలు' పెరిగాయి. 'నరాల బలహీనత' వంటి అర్థరహిత భావనలూ ప్రచారంలోకి వచ్చాయి.
  • మనసు మర్మం: విఖ్యాత మనస్తత్వవేత్త సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ సూత్రీకరణలకు వక్రవిశ్లేషణలు చెయ్యటం కూడా గందరగోళానికి దారితీసింది. మానవ ధర్మాలు, ప్రవర్తనలన్నీ అంతర్లీనంగా 'సెక్స్‌'తో ముడిపడి ఉంటాయన్న ఫ్రాయిడ్‌ సిద్ధాంతానికి దురర్ధాలు తీసి.. సెక్స్‌ విషయంలో మనసే ప్రధానమని, సెక్స్‌ సమస్యలన్నీ మానసికమైనవేనన్న భావన ప్రచారంలోకి తెచ్చారు. ఇదో చారిత్రక తప్పిదం. సాధారణంగా ఏ వైద్య విభాగమైనా ముందు అవయవ నిర్మాణం, పనితీరులను అర్థం చేసుకుని.. వాటిలో తలెత్తే లోపాలకు చికిత్సా మార్గాలను అన్వేషిస్తుంది. దురదృష్టవశాత్తూ ఒక్క 'సెక్సువల్‌ మెడిసిన్‌' విషయంలో మాత్రం శరీర నిర్మాణంపై అవగాహన కంటే ముందే 'సైకాలజీ' సిద్ధమైంది. మనసులో సెక్స్‌ ఆలోచనలుంటే చాలు.. అంగం అదే స్తంభిస్తుందన్న భావనలో ఉండిపోయారు.
అంతుబట్టని లోకం: 60-70లలో 'మాస్టర్స్‌ అండ్‌ జాన్సన్‌' సెక్స్‌ను ప్రముఖంగా రంగం మీదికి తెస్తూ.. తొంభైశాతం సెక్స్‌ సమస్యలు మానసికమైనవేనని సిద్ధాంతీకరించారు గానీ చాలా విషయాలు ఎంతకీ అంతుబట్టలేదు. సైకాలజీ సిద్ధాంతాలతో, కలల విశ్లేషణలతో చాలామందికి సమస్యలు నయం కాలేదు. సమస్యకు మూలం ఏమిటో, అసలు స్తంభన ఎలా వస్తుందో, దాన్లో ఏయే లోపాలు రావచ్చో అవగాహన కొరవడటం వల్ల తలెత్తిన సమస్య ఇది!
కొత్త కదలిక: సెక్స్‌ సమస్యల్లో సగానికి సగం.. అంగస్తంభనలకు సంబంధించినవే. ఆ రోజుల్లో పురుషాధిక్యతతో.. తమలో లోపం ఉందని పురుషులు అంగీకరించే పరిస్థితి లేకపోవటంతో.. లోపం ఎవరిదైనా స్త్రీలనే నిందించటం, వారి మీద 'గొడ్రాళ్ల'నీ, 'ఫ్రిజిడ్‌'లనీ ముద్ర వెయ్యటం కొనసాగింది. కానీ 80లలో స్త్రీస్వేచ్ఛా ఉద్యమాలు పెల్లుబికాయి. స్త్రీలు మౌనాన్ని ఛేదించుకుని బయటకొచ్చి నిలదీయటం ఆరంభించటంతో.. దీనిపై వైద్యపరంగా లోతైన, కచ్చితమైన పరిశోధనలు అనివార్యమయ్యాయి.
జీవ సహజం: ఆశ్చర్యకరంగా.. మానవ లైంగిక ప్రవృత్తి ఏ రకంగానూ జంతువుల కంటే భిన్నమైనది కాదనీ, అప్పటి వరకూ నమ్ముతున్న మానసిక, భావోద్వేగ సిద్ధాంతాలన్నీ పూర్తి వాస్తవాలు కావనీ వెల్లడైంది. సెక్స్‌ అన్నది ప్రాథమికంగా శారీరక జీవ ప్రక్రియ, మానసికాంశాలన్నీ దీనికి సహకరించేవన్న భావన బలపడింది. లైంగిక సమస్యలన్నీ మానసికమైనవేనన్న ధోరణి తప్పని తేలింది.
శరీర విజ్ఞానం:
1982: ఫ్రెంచ్‌ వాస్క్యులర్‌ సర్జన్‌ రోనల్డ్‌ విరాగ్‌ తొట్టతొలిగా పురుషాంగంలోకి ఓ మందును ఎక్కించి, కృత్రిమంగా తన క్లినిక్‌లో ఒకరికి స్తంభన తెప్పించాడు. దీంతో పురుషాంగ నిర్మాణం, పనితీరుపై అధ్యయనాలకు ఆస్కారం ఏర్పడింది. అంగం ఎలా స్తంభిస్తుంది, దానిలో ధమనులు, సిరలు, నాడుల పాత్ర ఏమిటో అర్థం చేసుకోవటం ఆరంభమైంది. స్తంభన లోపాలన్నీ మానసికమైనవేనన్న ధోరణి తొలగిపోయి.. కొత్త అవగాహన, ఆలోచనలు మొదలయ్యాయి. శారీరక కారణాలేవీ లేవని తేల్చుకున్నప్పుడే మానసిక చికిత్సలను ఆశ్రయించాలన్న అవగాహన పెంచిన విరాగ్‌.. 'ఫాదర్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఆండ్రాలజీ' అయ్యాడు! 1988లో తొలి ఆండ్రాలజీ పాఠ్యపుస్తకం వెలువడింది.
అడ్డుగోడలు
  • మధుమేహం, హైబీపీ
  • ఒత్తిడి, డిప్రెషన్‌
  • శారీరక శ్రమ లేకపోవటం
  • భాగస్వామితో సత్సంబంధాలు కొరవడటం

కొత్త విప్లవం : సెక్సువల్‌ మెడిసిన్‌లో కొత్త విప్లవం ఆరంభమైంది. రకరకాల పరికరాలు, పరీక్షలు, చికిత్సా విధానాలు అందుబాటులోకి రావటం ఆరంభమైంది. అంగస్తంభన సమస్య ఉందో లేదో, ఉంటే ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా చెప్పే రిజిస్కాన్‌, పురుషాంగంలోకి రక్త ప్రసారం ఏ తీరులో ఉందో చెప్పే 'పీనైల్‌ డాప్లర్‌' పరీక్ష, రకరకాల సమస్యలను సరిదిద్దే మైక్రోసర్జరీ, మైక్రోసూచర్స్‌, వాక్యూమ్‌ డివైస్‌లు, కృత్రిమంగా అమర్చే 'పీనైల్‌ ప్రోస్థెసిస్‌' వంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి.

స్త్రీ సమస్యలు
స్త్రీలలో సెక్స్‌ సమస్యలు సంక్లిష్టమైనవి. వీటిపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది.
  • కోరిక లేకపోవటం
  • విముఖత సమస్యలు
  • తృప్తి, భావప్రాప్తి సమస్యలు
  • బాధాకర సెక్స్‌
  • సంతాన రాహిత్యం
పురుష సమస్యలు
  • స్తంభన లోపాలు
  • సంతాన రాహిత్యం
  • స్ఖలన సమస్యలు
  • మలి వయసు ఆండ్రోపాజ్‌
  • అంగం వంపు సమస్యలు
మేలు చిట్టా : సంతానం ఒక్కటే కాదు.. చక్కటి సెక్స్‌తో ఎంత మేలు జరుగుతుందో చాలా అధ్యయనాలు వెలుగులోకి తెచ్చాయి. శృంగారంతో..
  • ఇద్దరిలోనూ చక్కటి ఆరోగ్య భావన
  • పెరిగే ఆయుఃప్రమాణం
  • తగ్గే బరువు, గుండెపోటు, పక్షవాతం ముప్పు
  • తగ్గే డిప్రెషన్‌. చక్కటి నిద్ర అదనపు లాభం.
  • అందంగా నిగారించే చర్మం

1998: వయాగ్రా ఆవిష్కారం..
సెక్స్‌ వైద్యరంగంలో పెను సంచలనం! ఎందుకంటే పురుషుల్లో చాలా భాగం పూర్తి నపుంసకులూ ఉండరు, పూర్తి సామర్థ్యం ఉన్నవాళ్లూ ఉండరు. ఎంతోమందికి అంగస్తంభనలో పాక్షికంగా సమస్యలుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకం పురుష లోపానికి.. ప్రత్యేకమైన ఔషధంగా వయాగ్రా రంగం మీదికి వచ్చింది.

అందరికీ లాభం: ప్రజల లైంగిక ఆరోగ్యం చక్కగా ఉండటమన్నది కేవలం వాళ్లకే కాదు.. వాళ్లు పని చేస్తున్న కంపెనీలకూ, ప్రభుత్వాలకూ, సమాజానికి కూడా అవసరం. లైంగిక ఆరోగ్యమన్నది వాళ్ల ఉత్పాదకతతో ముడిపడిన అంశమని స్పష్టంగా తేలింది. లైంగికంగా ఆరోగ్యంగా లేకపోతే.. రోజంతా ఆఫీసులోనే కూర్చున్నా వాళ్ల మనసుల్లో ఏదో బాధ పీడిస్తుంటుంది. ఇది వాళ్ల పనితీరును, ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.
చక్కటి లైంగిక ఆరోగ్యానికి కావాల్సింది..
పెద్దపెద్ద రొమ్ములు, పొడవాటి అంగాల కోసం ఆరాటం కాదు..
అపోహల్లేని.. చక్కటి అవగాహనతో కూడిన
ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సెక్స్‌ జీవితం! అది ముఖ్యం!!

20 June 2007

విశ్వాంతరాళాన్ని చుట్టిన సునీత

సునీత విలియమ్స్....
ఈ పేరు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
మరింకెంతోమందికి మార్గదర్శకం..

అంతేకాదు... భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన ఘనత కూడా మన భారత జాతి సంతతికి చెందిన సునీతకే దక్కడం భారతీయులమైన మనందరికి గర్వకారణం. మహిళలు అన్ని రంగాలలో రాణించగలరని మన సునీత నిరూపించారు. అత్యధిక దినాలు అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. నాసా రూపొందించిన అంతరిక్ష నౌక డిస్కవరీలో 2006 డిశంబర్ 11న కేప్ కేన్వరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్ళిన సునీత ఆరు నెలలకు పైగా అంతరిక్షంలోనే గడిపి అనేక మార్లు స్పేస్‌వాక్ చేశారు. ఇలా అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మహిళల్లో సునీత రెండవ మహిళ. అంతకుముందు అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన ఘనత జన్మతః భారతీయురాలైన కల్పనా చావ్లాకు దక్కింది. కల్పన, సునీతలు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి సైక్లింగ్ కూడా చేసేవారు.

గుజరాత్‌కు చెందిన డాక్టర్ దీపక్ పాండ్యా, యుగోస్లావియాకు చెందిన బోనీ దంపతులకు సునీత 1965 సెప్టెంబర్ 19న ఓహియోలో జన్మించారు. 1983లో మసక్కుచెట్స్‌లోని నీధం హైస్కూల్‌లో సునీత విద్యాభ్యాసం ప్రారంభమయ్యింది. ఆ తరువాత 1987లో అమెరికా నావల్ అకాడమీ నుంచి బి.ఎస్. ఫిజికల్ సైన్స్‌లో డిగ్రీ పొందారు. 1995లో ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్.లో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశారు. అనంతరం మైఖేల్ జె. విలియ
మ్స్ ను పెళ్ళిచేసుకున్నారు. వారికి సంతానం లేదు. తన పెంపుడు కుక్క గోర్బి అంటే సునీతకు ఎంతో ఇష్టం.

సునీతకు భారత దేశం పట్ల అమిత గౌరవం ఉంది. ఆమె నరనరాల్లో దేశభక్తి జీర్ణించుకుపోయింది. కేవలం తన తండ్రి మాత్రమే భారతదేశానికి చెందినవారు అయినప్పటికీ సునీత ఎప్పుడూ భారతదేశ కట్టుబాట్లను, సాంప్రదాయాలను పాటించడానికే ఇష్టపడతారు. స్పేస్‌వాక్ చేయడానికి పొడవాటి జుట్టు అడ్డుగా ఉంటుంది కనుక జుట్టు పొట్టిగా కత్తిరించాలని అధికారులు చెప్పినప్పటికీ ఏ మాత్రం ఒప్పుకోలేదట.

సునీత తన తండ్రితో ఎప్పుడూ ఇండియా గురించే మాట్లాడుతారు. సునీతకు భారతదేశం పట్ల ఎంత భక్తి ఉందంటే.. అంతరిక్షంలోకి ఆమె తనతోపాటుగా సమోసాలు, భగవద్గీత, వినాయకుని విగ్రహం, తండ్రి రాసిన ఉత్తరం కూడా తీసుకుని వెళ్ళారు. సునీత ఓహియాలో పుట్టి పెరిగినప్పటికీ, హిందూ దేవుళ్ళను ఎప్పుడూ పూజిస్తుంటారు. ముఖ్యంగా వినాయకుడు అంటే సునీతకు చాలా ఇష్టం. అలాగే భగవద్గీత ఎప్పుడూ చదువుతుంటారు. భగవద్గీత చదవడం వలన భయంపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుందనేది సునీత అభిప్రాయం. ఇక వంటల విషయానికొస్తే, మన భారతీయ వంటలు అంటే ఆమేకు ఎంతో ఇష్టం. సమోసాలంటే మరీ ఇష్టం.