సినీగీతాల సిరిమల్లి-డాక్టర్ వడ్డెపల
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనె
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే... ... అని భావకవితావినువీథిలో అక్షరనక్షత్రాల ముగ్గుల్ని చిత్రించిందా కలం.
నీ నవ్వులోనా విరజాజి వాన
ఆ వానలోన నేను తడిసేనా హాయిగా ... ... అని అందమైన నవ్వుల్లో పువ్వుల్ని పూయించి, అక్షరవర్షాన్ని కురిపించిందా కవనం.
కురిసింది వానవాన జల్లుకోరగా
విరిసంది ప్రేమప్రేమ తీయతీయగా... .... అని వానలదారాల తోరణాలు పేని
వలపుల మెరుపుల్ని కురిపిస్తుందా స్వరం.
జానపదం నుండి జావళీ వరకు
అంగారం నుండి శృంగారం వరకు
ఆటవెలది నుండి పాటవెలది వరకు...
పరిచయవ్యాసాల నుండి పరిశోధన వరకు
బుల్లి తెర నుండి వెండి తెర వరకు...
మాటల్లో కాకుండా చేతల్లో తన సామర్థ్యాన్ని చూపించిన మౌనవృక్షం, అక్షరగవాక్షాలు తెరిస్తే అగుపించే మూర్తిమత్వం, వెరసి చూస్తే డాక్టర్ వడ్డెపల్లి.
సిరిసిల్ల ఖిల్లా (కరీంనగర్ జిల్లా) లో రసరమ్యపారిజాతసుమవల్లిగా సముద్భవించిన డాక్టర్ సి. నారాయణరెడ్డి, సాహితీవారసుడుగా అంకురించి, లలితగీతాల పొదరింటిలో చివురించి, సినీగీతాల సురభిళాలతో వికసించిన సినీ కళామతల్లి సిగలో సిరిమల్లియేడాక్టర్ వడ్డెపల్లి.
వేలాది లలితగీతాల సృజనలో, గేయకథాకావ్యాల రచనలో, గేయనాటికావిరచనలో, నాటకాల ప్రదర్శనలో, పరిశోధనావివేచనలో, సినారె గారి తదుపతి సాహితీయానం చేస్తున్న డాక్టర్ వడ్డెపల్లి, మూడు దశాబ్దాలుగా సినీ గీతాలు రచిస్తూ, ఇటీవలే సినీ దర్శకుడుగా తన విశ్వరూపం ప్రదర్శించారు.
'పాట'కు పట్టం కట్టి, పాటలోనే ప్రాణాలు పెట్టిన వడ్డెపల్లిగారు 1948 సెప్టెంబర్ ఐదవ తేదీన లక్ష్మమ్మ-లింగయ్య దంపతులకు మూడవ కొడుకుగా జన్మించారు. వీరు చేనేత కుటుంబానికి చెందినవారు. కానీ చిన్నతనం నుంచి దృష్టి అంతా 'రాత' పైనే ఉండేది. బాల్యంలో నిరంతరం మగ్గాల శబ్దాలు, వీరు హృదయంలో మాత్రాఛందస్సుకు బీజం వేశాయి. తల్లి చదువుకోనప్పటికీ, మాటలన్ని అందమైన జానపదాలతో సాగేవి. ఉగ్గుపాలలో జానపద రసాలు, చేనేత మగ్గాల లయవిన్యాసాలు వడ్డెపల్లి గారిని భావుకుడిని చేశాయి. లేకుంటే
''మమతల మగ్గాల పైన
సమతావస్త్రముల నేస్తా...
మనిషి మనిషిలో వాడని
మల్లెల మనసుల్ని పూయిస్తా''
అని తన కవితాదృక్పథాన్ని అనంతరకాలంలో చాటి చెప్పుకొనేవాడా?
వడ్డెపల్లి గారి బాల్యం, స్కూలు జీవితం సిరిసిల్ల లోనే గడిచింది. శ్రీ వెంకటేశ్వరస్వామి గుడిలోని మైకులో, తన పాటలు కూడా వినిపిస్తే బావుండు అని ఉవ్విళ్లూరేవాడు... పదవ తరగతి విద్యార్థిగా...
''నమో నమో శ్రీరమణా
నను కరుణించుమురా కరుణాకర''
అని శ్రీరాముడిపై తొలి సారి ఓ భక్తిగీతాన్ని రాశారు. స్థానికంగా గాయకుడుగా పేరున్న శ్రీరా ములు అనే గాయకుడు, ఈ పాటను మెచ్చుకొని ట్యూన్ చేసి దసరా నవరాత్రుల సందర్భంగా, మైకులో పాడారు. వీరి కవనశక్తిని గ్రహించిన తెలుగు మాస్టార్లు నం దగిరి అనంతరాజశర్మ, కనపర్తి లక్ష్మీనరసయ్య, మరింత ప్రోత్సహించారు. స్కూల్ మాగజైన్‌కు తోటి పిల్లలు, తమ పెద్దవారితో రాయించుకొని వస్తే, వీరు స్వయంగా రాసేవారు. అలా, తన పదమూడో ఏటనే ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక, ప్రత్యేకంగా ప్రచురించిన పిల్లల వార్షికసంచిక, కథల పోటీలో వీరి 'విధిలిఖితం' బహుమతికి ఎన్నికైంది.
కథలతో పాటు, నాటకాలు కూడా రాసేవారు. అనేకనాటకాల్లో పాల్గొన్నారు. సినారె గారి 'సినీకవి' నాటికలో తారాపతి పాత్రను పోషించి బహుమతి పొందాడు. 'ఏడు సున్నాలు, పేటెంట్ మందు త్రిశంకుస్వర్గం, అశ్వత్థామ, పోతన, కర్ణ, ప్రజారాజ్యం, పిచ్చిరాజు, లవ్ మారేజ్, కట్టబ్రహ్మన్న' మొదలైన నాటల్లో నటించి, జిల్లాస్థాయిలో బహుమతులు పొందారు.
వీరు హై స్కూలు విద్యార్థిగా వున్నప్పుడే వీరి గురువు కనపర్తిగారు, సినారె గారి ''సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదులదావమా!'' పాటను పాడి వినిపిస్తూ విశ్లేషించేవారట. ఆ పాటలోని పదలాలిత్యం ఎంతో ఆకర్షించగా, అలాంటి పాటలు రావాలని భావించి తన భావుకతకు అక్షరరూపం ఇచ్చేవారు. మెడిసిన్ చదవాలనుకొని పి.యు.సి.లో బైపిసి గ్రూపులో చేరారు. కానీ ఫస్టు క్లాసులో పాసైనప్పటికీ, సీటు రానందున, తపాలాశాఖలో ప్రవేశించారు. 1968లో ఉద్యోగంలో చేరిన రోజుల్లోనే తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది. 1969లో 'కనరా నీ దేశం' అన్న గీతం తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసారమైంది. ఆ తర్వాత ఎన్నో వందల గీతాలు రచించారు. వాటిలో కొన్ని ఈ మాసపుపాటగా ప్రసారమైనాయి. 'మనమంత ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి' అన్న గీతం సామూహికగేయ శిక్షణకార్యక్రమానికి జాతీయస్థాయిలో ఎంపికై, 1995 సెప్టెంబర్‌లో అన్ని రేడియో కేంద్రాల ద్వారా ప్రసారమైంది.
196671ల మధ్య రచించిన గీతాలను 'కనరా నీ దేశం' శీర్షికన 1971లో ప్రచురించారు. అంతర్మథనం (1974) వసంతోదయం (గేయకావ్యం), 1978, రాగరథం (లలితగీతంలో 1981 గడ్డిపువ్వు గేయనాటిక (1979), హాలాహలం (1987), మనసా తెలుసా (ముక్తకాలు) ,1990, చిరుగజ్జెలు (బాలగేయ సంపుటి) 1992 మొదలైనవి ప్రచురించారు. తొమ్మిది గేయనాటికలు కూడా రాశారు. 'ఉగాదివేళ, ఆనందహేల, సంక్రాంతి లక్ష్మి' మొదలైన సంగీతనృత్యప్రధానరూపకాలు కూడా రాశారు. వీరు దాదాపు 12 గ్రంథాలు రచించగా, దాదాపు అన్ని రచనలు రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందించాయి.
మర్రి ఎంతగా పైకి పెరిగినా ఊడలతో మట్టి తల్లికి మొక్కు మనసా తన నీడలో మర్రి ఏ ఇతర చెట్టును తల ఎత్తనీయదని తెలుసా!-వంటి ముక్తకాలు, వీరికి ఎంతో పేరు తెచ్చాయి.
'రాగరథం' పుస్తకాన్ని ఎస్.పి. బాలు గారికి, 'వసంతోదయం' గేయకథాకావ్యాన్ని దర్శకుడు దాసరి నారాయణరావు గారికి, హాలాహలం గ్రంథాన్ని నటులు కృష్ణ-విజయనిర్మల దంపతులకు అంకితమిచ్చారు.
వీరి బాలల గీతాలు, మహారాష్ట్రలో ఐదు, ఆరవ తరగతుల తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేరాయి.
కవి యంటే వెలిగే దీపం
కవితంటే కాంతికి రూపం
అని నిర్వచించిన వీరు, వివిధపత్రికలకు విలువైన వ్యాసాలు, కథలు, రాస్తున్నారు. తొలి రచన నుండి నేటి వరకు ఆకాశవాణి, 'ఆంధ్రప్రభ' వీరి గేయాలను ప్రసారం చేస్తూ, ప్రచురిస్తూ ప్రోత్సహిస్తోంది. పాటలు రాయాలని భావించి తన భావుకతకు అక్షరరూపం ఇచ్చేవారు.
హై స్కూలులో హెచ్‌ఎస్‌సి తాలూకా స్థాయిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన వడ్డెపల్లిగారు మెడిసిన్ చదవాలని, బైపిసి గ్రూప్ తీసుకొని నిజాం కాలేజీ హైదరాబాద్‌లో పి.యుసి.లో చేరారు. తీరా వార్షికపరీక్షలకు ముందే నోట్సు, పుస్తకాలను ఎవరో కాజేయటం తో, ప్రప్రథమశ్రేణిలో కాకుండా ప్రథమశ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. దాంతో మెడిసిన్ చదవాలన్న కోరిక నెరవేరలేదు.
ఆ రోజుల్లో పియుసి ఫస్ట్ క్లాసులో పాసైనవారికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారు నేరుగా ఉద్యోగాలు ఇచ్చేది. 1968లో తపాలశాఖలో చేరారు. ఆ సంవత్సరంలోనే కృష్ణాపత్రికలో 'నేటి కాలం', స్రవంతి పత్రికలో 'ఎవడెరుగును' కవితలు (ఒకేసారి) తొలిసారిగా ప్రచురితమయ్యాయి. పోస్టల్ ట్రెయినింగ్ కోసం వైజాగ్ వెళ్లిన వీరు, సముద్రతీరంలో వెన్నెల అలల మిలమిలలు చూసి ''శిథిల శిల్పాల దాగిన కథల గురించి ఎవడెరుగును'' అన్న శీర్షికతో ఆశువుగా ఓ గేయం రాశారు.
లలితగీతాల లాహిరి
పత్రికలకు పంపించినట్లే, రేడియోకు కూడా తన పాటలను ప్రసారనిమిత్తం పంపించగా 1969లో 'కనరా నీ దేశం వినరా సందేశం' అన్న గీతాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, లలితసంగీతంగా ప్రసారం చేసింది. అది మొదలు నేటి వరకు వందల లలితగీతాలు రాశారు, రాస్తూనే వున్నారు. వీటిలో 'ఈ మాసపు పాటలు'గా, ప్రబోధగీతాలుగా ,'బృందగీతాలు'గా వన్నెకెక్కినవి కూడా వున్నాయి. ''అంతు లేని ఆశలున్న అంతరంగమా!'' ''జగతి రథం జై కొడుతూ (1972)'' ''వెన్నెలంత చల్లనిది స్నేహము'' మొదలైన గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. క్రీస్తు జన్మదినసందర్భాన్ని పురస్కరించుకొని రాసిన గీతం 1983 డిసెంబర్‌లో ఈ మాసపు పాటగా ప్రసారమైంది. 1995లో వీరు రచించిన ''మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి'' అన్న గీతం సామూహిక గేయశిక్షణకార్యక్రమానికి జాతీయస్థాయిలో ఎంపికై ఆ ఏడాది సెప్టెంబర్ మాసంలో దేశంలోని అన్ని రేడియో కేంద్రాల నుండి ప్ర సారమైంది. గతంలో మద్రాసు ఆకాశవాణి నుండి దాశరథి గారి గీతం ఇలా ప్రసారమైంది.
1966 నుండి 1971 వరకు రచించిన గీతాలను 'కనరా నీ దేశం' శీర్షికన 1971లో తొలి లలితగేయసంపుటిగా వెలువరించారు. 1981లో 'రాగరథం' శీర్షికన ప్రగతి, ప్రకృతి, ప్రణయ, ప్రస్తుతి, ప్ర బోధములనే ఐదు విభాగాలతో 100 గీతాలతో లలితగేయసంపుటి ప్రచురించారు.
సినీ గీతాల అరవిరి
ఆకాశవాణిలో ప్రసారమయ్యే లలితగీతాలను విన్న సంగీత దర్శకుడు టి. చలపతిరావు గారు సినిమాలకు పాటలు రాస్తే రాణిస్తావని సూచించి, బహుముఖప్రజ్ఞాశాలిని భానుమతి గారిని కలవమని చెప్పారు. తన కావ్యాలను, గేయాలను చూపించి వారి ఆశీస్సులందుకోవాలని, వడ్డెపల్లి గారు 1979, మేలో చెన్నై చేరుకొని, భానుమతి గారికి ముందుగా తన రచనలు పంపించి, బయటనే వెయిట్ చేశారు. ఆమె ఓ గంట పాటు ఓపికతో పరిశీలించి, లోనికి పిలిచి ''ఏదో భావగీతాలు రాసి మా మొహాన పడేయడం కాదు, పాటలు రాయడం అంటే.. ట్యూన్‌కు రాయాలి!'' అని దాదాపు ఆదేశించారు. అప్పుడు 'రచయిత్రి' అనే చిత్రాన్ని ఆమె నిర్మిస్తున్నారు. ఆ చిత్రంకోసం ఓ ట్యూన్ వినిపించింది. కల్యాణిరాగంలో కమనీయంగా పాడిన ట్యూన్‌కు.
నీవే లేని ఈ జీవితమే కలయై కరిగెనులే...
నాలో కలతై మిగిలెనులే...
అని పల్లవి రాశారు. భానుమతి గారు సంతోషించి మిగతా చరణాలను పూర్తి చేయించి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించి రికార్డు చేశారు. కానీ చిత్రాన్ని మాత్రం విడుదల చేయలేదు.
'రచయిత్రి' నిర్మిస్తున్న సమయంలోనే భానుమతిగారు 'ఒకనాటి రాత్రి' డబ్బింగ్ చిత్రానికి పాటలు రాయించారు. తమిళం నుండి ఎలా అనువదించాలో కొన్ని మెలకువలు కూడా చెప్పారు.
కొండపల్లి బొమ్మను నేను
బొండుమల్లి రెమ్మను నేను
అని తెలుగుతనం పరిమళించే విధంగా రాశారు.
డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారిని పరిచయం చేసుకొని, సినీ రచన పట్ల తన ఆరాటాన్ని, తను చేసే ఒంటరి పోరాటాన్ని వినయంగా వివరించగా, అన్నపూర్ణ స్టూడియో వారి రెండో చిత్రం 'పిల్ల జమీందార్'లో అవకాశమిచ్చారు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు.
చక్రవర్తిని బీట్ ప్రధానంగా కాకుండా మెలొడీ ట్యూన్ ఇవ్వాల్సిందిగా అక్కినేని సూచించారు. ఆ వరసకు సరసంగా రాసిన గీతం:
నీ చూపులోన విరజాజి వాన
ఆ వానలోన నేను తడిసేనా... హాయిగా...
నీ నవ్వులోన రతనాల వాన
ఆ నవ్వులోన మేను మరిచేనా తీయగా...
అన్న పల్లవితో రాసిన పాటను బాలు, సుశీల, శైలజ త్రిగళగీతంగా పాడారు. 21.9.80న 'పిల్ల జమీందార్' విడుదలై విజయవంతంగా ఆడింది. ''వెన్నెల పరదాలు, వన్నెల సరదాలు'' వంటి పదబంధాలతో సాగిన ఈ పాట, ఆ సంవత్సరపు హిట్ సాంగ్ గా నిలవడం విశేషం.
రచయిత, దర్శకుడు గిడుతూరి సూ ర్యంగారు 'అమృతకలశం' (1981) చిత్రం కోసం 'జావళి' రాయించారు.
సిగ్గాయె సిగ్గాయెరాస్వామీ
బుగ్గంత ఎరుపాయెరా.. అన్న జావళిని రమేశ్‌నాయుడు
ఖరహరప్రియ, సుతిమెత్తని స్వరాలతో స్వరపరచగా సుశీల శృంగారరసోద్దీపకంగా ఆలపించారు. ''లలితరాగ నవపల్లవాధరము సతత మందించగా'' వంటి వ్యక్తీకరణతో సాగిన ఈ గీతం ప్రాచుర్యంలోకి రాని మధురాతిమధురగీతం. సముద్రం శ్రీశ్రీ, సినారె, తదుపరి 'జావళి' రచించిన 'పాళీశ్వరుడు'వడ్డెపల్లి.
పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన వెంకటేశ్వరరావు గారు వడ్డెపల్లిని, కవిత్వంలో కొత్త మెరపులు కోరుకొనే అభిరుచి గల నిర్మాత, సాహితీవేత్త, ఏ.ఎం. రత్నంగారికి పరిచయం చేశారు. అప్పటికీ 'యుగకర్తలు, పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు' చిత్రాలకు వడ్డెపల్లి పాటలు రాశారు. వీరి రచనల్లో గల వైవిధ్యాన్ని గుర్తించిన రత్నంగారు, 'పెద్దరికం' (జగపతిబాబు, సుకన్య) చిత్రంలో అవకాశం ఇచ్చారు. కోటిగారు యిచ్చిన ట్యూన్‌కు..
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే..
ఆశల రెక్కలు హంసలు పల్లకి మోసుకుపోవలెనే..
అని రాశారు. 'యమన్' రాగంలో కొన్న స్వరాలు తీసి, 'హంసనాదం' స్వరాలతో శ్రావ్యంగా సాగిన ఈ గీతాన్ని, చిత్రబృందం మనోజ్ఞంగా పాడారు. స్వర్గీయ సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతసాహిత్యాలను ప్రశంసించారట.
ప్రతి కవికి కొన్ని శబ్దాల పట్ల ప్రీతి వుంటుంది. వడ్డెపల్లి గారి గేయసాహిత్యాన్ని పరిశీలిస్తే వారు 'మబ్బులంటేనే ఉబ్బితబ్బిబ్బవుతారని తెలుస్తుంది. నీరదాల పరదాల నిలిచిన రేరాజ/ గగనేందిర గళమందున ఎగిరే జలహారమా/ వంటి అభివ్యక్తులతో వరుణ రాగాన్ని ఆలపించారు.
మేఘంలా మనిషి మమతను వర్షించాలి.
మానవత్వబీజాలను మహిలో పండించాలి! అని అంటారు. వరిపొలాలలో జలాలను, కవి కలాలలో మృదుపదాలను ఉత్తేజపరిచేది మేఘమనే వారి భావన...
ఈ సినీగీతంలో వాడిన 'మబ్బుల పల్లకి' పదాన్నే తన సినీగీతాల సంపుటికి శీర్షికగా పెట్టుకోవడం గమనించవచ్చు. స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, తమ తొలి సినీగీత సంపుటిని 'మేఘమాల'తో వెలువరించారు.
'సంకల్పం' (జగపతిబాబు, గౌతమి) చిత్రంలో కూడా ఏ.ఎం. రత్నంగారు వడ్డెపల్లి గారితో 'కురిసింది వానా వానా జల్లు కోరగా' అనే ఓ వాన పాటను రాయించారు. ఈ పాటలో ''కరిమబ్బు లు పయనించగా మది నెమలి ఆడిందిలే'' అని ఉల్లేఖించారు. కీ|| శే|| రాజశ్రీ గారి ఈ పాటను విని మెచ్చుకున్నారట. వారి 'కురిసింది వాన' పాటందించిన స్ఫూర్తితోనే వీరు రాశారు.
ఆ తరువాత 'పిడికెడు ఆకాశం, దిగ్విజయం, అందరూ అందరే, ఏంటి బావా మరీను, వార్నింగ్, అనుమానం మొగుడు, మా ఊరి కిట్టయ్య, పిలిస్తే పలుకుతా, లీడర్, సంకల్పం, జై బాలాజీ, ఉషాకిరణాలు, అమ్మో పోలీసోళ్ళు' మొదలైన చిత్రాల్లో శతాధిక గీతాలు రాశారు.
శుభాకర్, పూర్ణిమల తొలి చిత్రం 'పిడికెడు ఆకాశం'కు ఎస్.డి. లాల్ గారు అవకాశం ఇచ్చారు. ''పగలే చుక్క పొడిచెరో, వెలుగులే చేతి కందెరో' 'అందితే ఆకాశం పిడికెడు' పాటలు రాశారు. తెలంగాణ ప్రాంతంలో ఆకాశాన్ని 'మొగులు' అంటారు. ఈ పాటల్లో డబ్బు వాదం గమనించదగ్గది.
చందమామ విజయావారి 'భైరవద్వీపానికి' దర్శకత్వం వహించిన సింగీతం, ఆ చిత్రంలో ''అంబా శాంభవి భద్రరాజగమనా!'' అన్న భక్తిగీతాన్ని రాయించారు. పల్లవి శార్దూలంలో మొదలైనట్లనిపించినా, ఆ తరువాత తేలిక పదాల్లోని భక్తిదీపంగా వెలుగుతుం ది. మాధవపెద్ది సురేశ్ స్వరకల్పనలో జానకి ఎంతో కరుణ రసాత్మకంగా పాడారు.
'ఏంటి బావా మరీను'లో విద్యాసాగర్ స్వరపరచిన వీరి ''ఆకుచాటు పిందే'' కూడా మెలొడీ సాంగ్.
'పెళ్ళిళ్లోయ్ పెళ్ళిళ్ళు' చిత్రంలో తనపై చిత్రించిన ''నాదము నువ్వే'' గీతకర్త వడ్డెపల్లి గారని తెలుసుకొన్న నటుడు నరేశ్, 'మొగుడు పెళ్ళాల దొంగాట' (దర్శకత్వంవిజయనిర్మల) లో అవకాశాలిప్పించి ప్రోత్సహించారు. ఇందులో అన్ని 'లఘువులతో'నే పాట రాశారు.
'ఉషశ్రీ' వారు 2001లో 'ఓ మారియా' క్రైస్తవచిత్రంలో తొలిసారిగా అన్ని పాటలు (సింగిల్ కార్డుగా) రాసే అవకాశం ఇచ్చారు. 'మారియా' బుద్ధుని కాలంలో ఆమ్రపాలి వంటిది. ఇందులో పాటలను ఉష, రాజేశ్ పాడారు.
విజయచందర్ నిర్మించిన 'పిలిస్తే పలుకుతా'లో సాయిబాబాపై చక్కని గీతాన్ని రచించారు.
'పోలీసు కర్తవ్యం, గూఢచారి నెం.1, ఏజెంట్ అమర్ ఇన్ సౌండ్ కాండ్ మొదలైన అనువాదచిత్రాల్లో పాటలు రాసిన వడ్డెపల్లిగారు, పలు బుల్లితెర సీరియల్స్‌కి థీం సాంగ్స్, టైటిల్ సాంగ్స్ రాశారు. కొన్ని చిత్రాలకు మాటలు, పాటలు, కో-డైరెక్టర్‌గా కూడా చేశారు.
శ్రీ వద్దిరాజు లత ప్రసాద్ నిర్మించిన 'భక్తకవి పోతన' (సప్తగిరి ఛానెల్1998) కథ, మాటలు, పాటలు రాసి, కోడైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీ పి.వి. మనోహర్‌రావు నిర్మించిన 'భారతీయసం స్కృతీశిఖరాలు, కొండ పిడుగు, అమృతకలశం, వెన్నెల కాపురం, అతిథి, మంచు తెరలు,' మొదలైన టెలీ ఫిల్ములకు రచన, సహ దర్శకత్వం చేశారు. 'వేములవాడ రాజరాజేశ్వరమహాత్మ్యం' టెలీ ఫిల్ముకు రచన, దర్శకత్వం చేశారు. దాదాపు (30) ప్రైవేటు ఆడియో ఆల్బమ్స్‌కు పాటలు రాశారు. 'కరీంనగర్ క్షేత్రాలు, అందుకో మారుతి, శ్రీ వేంకటేశ్వరవైభవం, శరణం శబరీశ, అష్టలక్ష్మీవైభవం, కీసర కీర్తన, నమో వెంకటేశ, హనుమద్గానం, ఓం నమశ్శివాయ, హరిహరక్షేత్రాలు' మొదలైన వాటిలో బాలు, జేసుదాసు, వాణీజయరాం, శైలజ, నాగూర్ బాబు పాడారు. 'శివపార్వతి స్తుతిమాల'ను డాక్టర్ బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.
ఇవే కాకుండా యువతరం కోసం, 'లోలక్ డోలె తప్పి', 'హై టెక్ లవ్' వంటి వెరైటీ క్యాసెట్స్‌కు రాశారు. పల్లెమనసు (జానపదం) చిరు ఓ చిరు (పాప్) మొదలైనవి వీరి వైవిధ్యరచనలే.
'ఇందిరమ్మ క్రాంతిపథం, విభిన్న ప్రతిభావంతులు, తెలుగు భారతి, ఆటా' (అమెరికా తెలుగు సంఘం) వారి స్వాగతగీతంకూడా రచించి సన్మానితులయ్యారు. సంగీతనృత్యరూపకాలల్లో 'ఆమ్రపాలి, రామా 2 రామం, కవి కల్యాణం' ముఖ్యమైనవి. 'చాణక్య, మాతృదేవత, పునరపి, మహాకవి కాళిదాసు, ఆత్మయాత్ర, వైకుంఠపాళి' మొదలైన సీరియల్స్ (ఈటివి, జెమిని, మా టివి) కూడా రాశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రుడు మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి వైభవానికి 30 ఎపిసోడ్‌లకు రచన, సహదర్శకత్వం బాధ్యతల నిచ్చారు.
బుల్లి తెరకు, వెండి తెరకు విస్తృతరచన చేస్తూ సాహితీయజ్ఞా న్ని నిర్వహిస్తున్న వడ్డెపల్లి గారు పొందిన బిరుదులు, సత్కారాలు కూడా విలువైనవి. ఘంటసాల కళాపీఠం మచిలీపట్నం వారి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పురస్కారం (1989), సాహితీ గౌత మి కరీంనగర్ వారి సినారె పురస్కారం (1996), ఆంధ్రమహిళాసభ వారి దేవులపల్లి పురస్కారం పొందారు. వరుసగా మూడుసార్లు 'రాష్ట్రపతి'గా (1987, 1992, 94) లో ఎన్టీ రామారావు, ఎన్. జనార్దనరెడ్డి, విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడులచే సన్మానం పొందారు. 1996లో నాటి ప్రధాని వాజ్‌పేయి గారు 'ప్ర బోధకవి'గా సత్కరించారు. అమెరికన్ తెలుగు సంఘం వారు 'లలితశ్రీ' బిరుదుతో (2004) సత్కరించారు. ఈ సత్కారాల కన్న వేములవాడ రాజరాజేశ్వరదేవస్థానం వారు వెండి పలకపై 'గేయకిరీటి' అని బిరుదునిచ్చి (1995) సత్కరించడం, తన జీవితంలో పొందిన మధురానుభూతి అని భావిస్తారు. పియుసి తర్వాత, బి.ఏ., ఎం.ఏ, ప్రైవేటుగానే చదివిన వడ్డెపల్లిగారు 'తెలుగులో లలితగీతాలు' అన్న అంశంపై విశేషపరిశోధన చేసి (ఉస్మానియా విశ్వవిద్యాలయం) 1998లో డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధనను ప్రశంసించిన, ప్రోత్సహించిన బాలుగారికే ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు. లలితగీత ప్రారంభ-వికాస-పరిణామాలు తెలుసుకొనగోరేవారికి ఈ గ్రంథం ఓ కరదీపిక.
అంతర్జాతీయ బాలలచిత్రోత్సవంలో క్రిటిక్ జ్యూరీ సభ్యుడుగా (2003) నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్క్రిప్టు ప్యానెల్ సభ్యుడుగా కూడా వ్యవహరించిన వడ్డెపల్లి, తను పని చేసిన తపాలాశాఖలో ఇన్యూరెన్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా వరుసగా ఏడు సార్లు బంగారు పతకాలను పొందారు. ఆరుద్ర 'కూనలమ్మ పదా లు' శ్రీశ్రీ ప్రాసక్రీడలు, వెన్నెలకంటి 'వెన్నెలమ్మ' పదాలు సృష్టించినట్లే వడ్డెపల్లి 'ఆటవెలది' ఐదు సూర్యగణాలతో 'పాటవెలదు'లను ఆధునికసామాజికాంశాలతో అందంగా రాస్తున్నారు.
రచన నుండి దర్శకత్వపథానికి
''శిశిరమందు గూడ శిరసు నెత్తి
ఎర్రకొడవలి వోలె ఎన్నొ పూల
మోసులెత్తి పూయు మోదుగుయిల
జ్వలితక్రాంతి హృదయదళిత వోలె''
వంటి 'పాటవెలది' కేవలం ఉదాహరణ మాత్రమే.
తెలుగు సినీ సరస్వతిని పాటల మందారాలతో నిత్యం సమర్పించే వడ్డెపల్లి గారి పూర్తి పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. సినీ రచయితలు దర్శకత్వశాఖను చేపట్టిన సందర్భాలు చాలా తక్కువే. గతంలో సముద్రాల, ఆత్రేయ, రాజశ్రీ, వీటూరి, పాలగుమ్మి పద్మరాజు, నేడు త్రివిక్రమ్, పోసాని మురళికృష్ణ వంటి వారు కనిపిస్తారు. రచన, దర్శకత్వం తనకు జోడు గుర్రాల స్వారీ కాదని, ఉచ్ఛ్వాసనిశ్వాసాలని, ఆత్మవిశ్వాసంతో తెలుపుకున్నారు. కమలాకర కామేశ్వరరావు గారి వలె అన్ని రకాల చిత్రాలకూ దర్శకత్వం వహించాలన్నది తన కోరిక అంటారు. కో-డైరెక్టర్‌గా పని చేసిన అనుభవంతో అక్షిత బాలాజి క్రియేషన్స్ వారి 'ఎక్కడికెళ్తుందో మనసు' (2005) చిత్రానికి రచన చేసి, దర్శకత్వం వహించి తన ఇన్నింగ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం యువతకు సంబంధించిన మరో చిత్రకథారచన చర్చల్లో ఉన్నారు.
సినీరంగంలో 'గాడ్ ఫాదర్లు' లేకున్నా 'బ్యాడ్ ఫాదర్లు' ఉండకూడదనే వడ్డెపల్లి గారి మాటల్లో, మూడు దశాబ్దాల సినీ జీవనప్రస్థానంలో ఎదురైన ''అమృతకలశాలు, హాలాహలాలు'' ధ్వనిస్తుంటాయి.
'బుల్లి తెర వెండి తెర'లకు తాను రచించిన పాటలను 'మబ్బుల పల్లకి'గా ఈ నెల 18వ తేదీన వెలువరిస్తున్న వడ్డెపల్లిగారు, సినీరంగంలో సిరిమల్లెగా పరిమళించి పరిఢవించాలని, తెలుగు రసజ్ఞలోకం ఆశిస్తూంది.
డాక్టర్ వొద్దిరాజు వెంకటరామారావు
98492 37663
(మే 18నడాక్టర్ వడ్డెపల్లి కృష్ణ 'మబ్బుల పల్లకి' ఆవిష్కరణ సందర్భంగా)
డాక్టర్ వడ్డెపల్లి కృష్ణగారి కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు
1. నీ చూపులోన.. (పిల్లజమీందార్),
2. సిగ్గాయె సిగ్గాయె.. (అమృతకలశం),
3. చెలీ నీ చూపె... (దిగ్విజయం),
4. ఆకు చాటు.. (ఏంటి బావా మరీను),
5. ముద్దుల జానకి... (పెద్దరికం),
6. దివి నుండి.. (పిలిస్తే పలుకుతా),
7. ఏదో కోరిక... (లీడర్),
8. గోవిందా హరి.. (అమ్మో పోలీసోళ్ళు),
9. నాదం నువ్వే... (పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు),
10. ధర్మోరక్షతి.. (జై బాలాజి)
'సంకల్పం' (జగపతిబాబు, గౌతమి) చిత్రంలో కూడా ఏ.ఎం. రత్నంగారు వడ్డెపల్లి గారితో 'కురిసింది వానా వానా జల్లు కోరగా' అనే ఓ వాన పాటను రాయించారు. ఈ పాటలో ''కరిమబ్బు లు పయనించగా మది నెమలి ఆడిందిలే'' అని ఉల్లేఖించారు. కీ|| శే|| రాజశ్రీ గారి ఈ పాటను విని మెచ్చుకున్నారట. వారి 'కురిసింది వాన' పాటందించిన స్ఫూర్తితోనే వీరు రాశారు.
