విజ్ఞానం వెలుగులోకి!
సెక్స్ అంటే 'బూతు' కాదు.
సెక్స్ అంటే- ప్రేమ, ఆప్యాయత, సాన్నిహిత్యం, పునరుత్పత్తి, పెంపకం,
అంతిమంగా కుటుంబ వ్యవహారమన్న వైఖరి ముఖ్యం.
సెక్స్ పట్ల ప్రజల్లో లేనిపోని ఆసక్తి రేకెత్తించటం కాకుండా..
సెక్స్‌ను ఒక ఆహ్లాదకరమైన, బాధ్యతాయుతమైన కుటుంబ వ్యవహారంగా
చూడటం, చూపించటం.. చాలా అవసరం!
సెక్స్ అంటే- ప్రేమ, ఆప్యాయత, సాన్నిహిత్యం, పునరుత్పత్తి, పెంపకం,
అంతిమంగా కుటుంబ వ్యవహారమన్న వైఖరి ముఖ్యం.
సెక్స్ పట్ల ప్రజల్లో లేనిపోని ఆసక్తి రేకెత్తించటం కాకుండా..
సెక్స్‌ను ఒక ఆహ్లాదకరమైన, బాధ్యతాయుతమైన కుటుంబ వ్యవహారంగా
చూడటం, చూపించటం.. చాలా అవసరం!
మానవ నాగరికత విస్తరిస్తూ.. మనిషి పురోగమిస్తున్న తొలి నాళ్లలో.. సెక్స్ పట్ల ఎటువంటి దాపరికాలూ లేని విశాల దృక్పథమే ఉండేది. ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ నాగరికతలన్నింటిలోనూ ఇదే సానుకూల థోరణి ప్రతిఫలించింది. కానీ కాల క్రమంలో.. సెక్స్.. ఓ చాటుమాటు వ్యవహారంగా.. బహిరంగంగా మాట్లాడటానికి కూడా వీల్లేని చీకటి తంతుగా మారిపోయింది. ఫలితంగా సెక్స్ చుట్టూ ఎన్నో అపోహలు అల్లుకున్నాయి. అజ్ఞానం ఆవరించింది. అరకొర అవగాహన పెద్ద అడ్డుగోడ అయ్యింది. వీటన్నింటినీ ఛేదించటానికి శాస్త్ర రంగానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. సెక్స్‌ను సశాస్త్రీయంగా అర్థం చేసుకుంటూ.. సెక్స్ సమస్యలకు సమర్థ చికిత్సలు అందుబాటులోకి తేవటంలో నేటి ఆధునిక వైద్యరంగం అనూహ్య పురోగతి సాధించింది. ఈ గమ్యం.. ఈ పురోగతి.. ఎంతో విజ్ఞానదాయకం! అపోహలు వీగిపోవటానికి ఇదెంతో అవసరం!
మనం ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవైపు- హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసుల్లో మిగతా ప్రపంచ దేశాలను దాటిపోయాం. సెక్స్ పట్ల అవగాహన అట్టడుగు స్థాయిలో ఉంది. పట్టణాల్లో అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. యుక్తవయసు కూడా రాకముందే చాలామంది లైంగిక కార్యకలాపాలకు దిగుతున్నారు. డబ్బు దండిగా చేతికి అందుతుండటంతో చిన్నవయసులోనే ఉత్సుకత పెరుగుతోంది. టీవీలు, వెబ్‌సైట్లు తేలికగా దారి తప్పిస్తున్నాయి. మరోవైపు- 'సెక్స్ సమస్య'లూ పెరుగుతున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులతో మధుమేహం-హైబీపీ విస్తరించిపోతూ.. వీటి ఫలితంగా సామర్థ్య సమస్యలూ అనూహ్యంగా పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమలేని జీవనశైలి ఎందరినో లైంగికంగా కుంగదీస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే మున్ముందు మన దేశం 'ప్రపంచ నపుంసక కేంద్రం'గా మారుతుందన్న హెచ్చరికల్లో అతిశయమేం లేదు. సెక్స్ పట్ల మన వైఖరిలో మార్పు రావాల్సిన, అవగాహన పెరగాల్సిన సందర్భమిది!
సరైన లైంగిక విజ్ఞానాన్ని అందించాల్సిన ఇళ్లలో, స్కూళ్లలో, సమాజంలో.. అన్నిచోట్లా సెక్స్‌ను ఒక 'నిషిద్ధ పదం'గా చూస్తుండటం వల్ల అనుమానాలు, అపోహలు రాజ్యమేలుతున్నాయి. వాస్తవానికి సెక్స్ విషయంలో ఆధునిక శాస్త్ర రంగం ఎంతో పురోగమించింది. మధ్య యుగాల నాటి చీకటి తెరల్లోంచీ, గుడ్డినమ్మకాల్లోంచీ సెక్స్‌ను బయటకు తెచ్చి.. దాన్ని సశాస్త్రీయంగా అర్థం చేసుకోవటంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధి సాధించింది. ఎన్నో అపోహలు వీడిపోయాయి. ఎన్నో సెక్స్ సమస్యలకు ఇప్పుడు సమర్థమైన పరిష్కారాలు, చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ శాస్త్రీయమైన లైంగిక విజ్ఞానం అందరికీ అందటం.. ఇప్పటి కనీస అవసరం.
సమాజంలో సర్వత్రా 'సెక్స్' కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఏది సరైన సెక్స్? ఏది సురక్షిత సెక్స్? ఏది బాధ్యతాయుతమైన సెక్స్? అన్న అవగాహన మాత్రం కనీస స్థాయిలో ఉంటోంది. సెక్స్ గురించి తెలుసుకోవటంలో, అవగాహన పెంచుకోవటంలో ఎవరికీ అసౌకర్యం ఉండకూడదు. 'లైంగిక విద్య' అన్నది కేవలం ఇంట్లోనో, లేక కేవలం స్కూల్లోనో నేర్పేది కాదు. ఇది చిన్నతనం నుంచీ, అన్ని వైపుల నుంచీ అందాలి. బాధ్యతాయుతమైన లైంగిక విద్య స్కూలు కంటే ముందే.. ఇంటి దగ్గరే ఆరంభమవుతుంది. అది తప్పు ధోరణిలో సాగకూడదు. పిల్లలు జననావయవాలు ముట్టుకోవటం సహజం. వెంటనే మనం 'ఛీఛీ, చెయ్యి తీసై' అనకూడదు. దీనివల్ల పిల్లలు సెక్స్ అనేది చెడ్డపని, అపరిశుభ్రమన్న తప్పుడు నమ్మకాల్లో పెరుగుతారు. క్రమేపీ బిడియం, భయాల్లో కూరుకుంటారు. చివరికి తప్పుడు మార్గాల్లో.. తప్పు సమాచారాన్నే ఒంటబట్టించుకుంటారు. సెక్స్ విజ్ఞానాన్ని ఇంట్లోనూ, స్కూల్లోనూ కూడా ఆరోగ్యకరమైన ధోరణిలో అందించటం అవసరం. సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో పిల్లలకు కేవలం సైన్స్ బొమ్మలు చూపిస్తూ.. జబ్బుల గురించి చెబుతుంటే వాళ్లకు ఆసక్తి ఉండదు. సెక్స్ అనేది వాళ్ల దృష్టిలో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అంశం. దాన్ని ఆ ధోరణిలోనే.. వైజ్ఞానికంగా చెప్పాలి.
1994: ప్రపంచ ఆరోగ్య సంస్థ 'లైంగిక ఆరోగ్యాన్ని' 'ప్రాథమిక మానవ హక్కు'గా గుర్తిస్తూ ప్రకటన చేసింది. ఇదో గొప్ప మలుపు. అంతకు ముందు సెక్స్ సమస్యలకు వైద్యం చేసేవాళ్లను నాటువైద్యులుగా, నకిలీ మోసగాళ్లుగా చిన్నచూపు చూస్తుండేవాళ్లు. మిగతా వైద్యులకుండే గౌరవం వీరికి దక్కేది కాదు. నిజానికి అప్పట్లో అంత విజ్ఞానం, శిక్షణ లేకపోయినా.. సెక్స్ సమస్యలను ముఖ్యమైన సామాజిక సమస్యగా గుర్తించి.. దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినందుకు వాళ్లు ఎంతోకొంత అభినందనీయులే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపుతో ఈ పరిస్థితి మారింది.. సెక్స్ వైద్యం గౌరవప్రదమైన వ్యవహారంగా ప్రధాన స్రవంతిలోకి వచ్చింది!
- ఆరాధన: సెక్స్ పట్ల 'చిన్నచూపు' అన్నది మొదటి నుంచీ ఉన్నది కాదు, మధ్యలో తెచ్చిపెట్టుకున్నది! ప్రాచీనకాలంలో ప్రతి మానవ నాగరికతలోనూ సెక్స్ పట్ల స్పష్టమైన దృక్పథం కనబడుతుంది. గ్రీకు, జపాన్ సంస్కృతులతో పాటు మన దేవాలయాల మీది శిల్పాలు, లింగపూజల వంటివన్నీ సెక్స్ పట్ల నాటి సమాజంలో ఎటువంటి భేషజాలూ, పట్టింపులు లేకపోవటాన్నే సూచిస్తాయి. అలాగే సంతాన దేవతలు, సామర్థ్య దేవతలను కొలవటం ప్రతి సమాజంలో ఉన్నదే. సెక్స్‌ను 'బూతు'గా చూడటమన్నది తర్వాత్తర్వాతి విపరిణామం.
- వలస ధోరణి: సెక్స్ అన్నది నలుగురిలో మాట్లాడటానికి లేని చాటుమాటు వ్యవహారంగా పరదాల వెనక్కివెళ్లింది ప్రధానంగా పంధొమ్మిదో శతాబ్దం మధ్య.. విక్టోరియన్ (బ్రిటీషు పాలనా) కాలంలో! ఈ ప్రపంచ వ్యాప్త ధోరణి.. ప్రత్యక్షంగా బ్రిటీషు పాలనలో ఉన్న మన దేశాన్ని మరింతగా ప్రభావితం చేసింది. అప్పటికే ఒకవైపు 'కామసూత్ర' వంటి సానుకూల వాతావరణం, మరోవైపు సంకుచిత సంప్రదాయాల మధ్య నలుగుతున్న మన సమాజం... ఈ బ్రిటీషు పాలనా కాలంలో పూర్తి గందరగోళంలో పడిపోయింది. సెక్స్ పట్ల దాపరికాలు, ద్వంద్వనీతి, లేనిపోని దురభిప్రాయాలన్నీ మొదలయ్యాయి. నేటికీ కొన సాగుతున్న అవగాహనా రాహిత్యానికి బీజాలు ఈ కాలంలో పడ్డవే!
- అనాది బాధే: పటుత్వాన్ని 'పురుషత్వం'గా, గొప్ప 'సామర్ధ్యం'గా చూసే ధోరణి కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు నపుంసకత్వం, సామర్ధ్య రాహిత్యమన్నది ఆది నుంచీ ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకుని, సమస్య నుంచి బయటపడేందుకు సహకరించే శాస్త్రీయ వైద్యమే లేదు. ఫలితంగా నాటు డాక్టర్లు, వాజీకరణాల్లాంటివే నాడు ఆధారమయ్యాయి. పాశ్చాత్య దేశాల్లో ఖడ్గమృగం కొమ్ములూ, మన ప్రాంతాల్లో ఊరపిచ్చుక లేహ్యాల్లాంటివి లేనిపోని ప్రచారంలోకి వచ్చాయి. శాస్త్రీయమైన అవగాహన కొరవడటంతో.. హస్తప్రయోగం, వీర్యం వంటి విషయాల్లో బోలెడు 'అపోహలు' పెరిగాయి. 'నరాల బలహీనత' వంటి అర్థరహిత భావనలూ ప్రచారంలోకి వచ్చాయి.
- మనసు మర్మం: విఖ్యాత మనస్తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ సూత్రీకరణలకు వక్రవిశ్లేషణలు చెయ్యటం కూడా గందరగోళానికి దారితీసింది. మానవ ధర్మాలు, ప్రవర్తనలన్నీ అంతర్లీనంగా 'సెక్స్'తో ముడిపడి ఉంటాయన్న ఫ్రాయిడ్ సిద్ధాంతానికి దురర్ధాలు తీసి.. సెక్స్ విషయంలో మనసే ప్రధానమని, సెక్స్ సమస్యలన్నీ మానసికమైనవేనన్న భావన ప్రచారంలోకి తెచ్చారు. ఇదో చారిత్రక తప్పిదం. సాధారణంగా ఏ వైద్య విభాగమైనా ముందు అవయవ నిర్మాణం, పనితీరులను అర్థం చేసుకుని.. వాటిలో తలెత్తే లోపాలకు చికిత్సా మార్గాలను అన్వేషిస్తుంది. దురదృష్టవశాత్తూ ఒక్క 'సెక్సువల్ మెడిసిన్' విషయంలో మాత్రం శరీర నిర్మాణంపై అవగాహన కంటే ముందే 'సైకాలజీ' సిద్ధమైంది. మనసులో సెక్స్ ఆలోచనలుంటే చాలు.. అంగం అదే స్తంభిస్తుందన్న భావనలో ఉండిపోయారు.
కొత్త కదలిక: సెక్స్ సమస్యల్లో సగానికి సగం.. అంగస్తంభనలకు సంబంధించినవే. ఆ రోజుల్లో పురుషాధిక్యతతో.. తమలో లోపం ఉందని పురుషులు అంగీకరించే పరిస్థితి లేకపోవటంతో.. లోపం ఎవరిదైనా స్త్రీలనే నిందించటం, వారి మీద 'గొడ్రాళ్ల'నీ, 'ఫ్రిజిడ్'లనీ ముద్ర వెయ్యటం కొనసాగింది. కానీ 80లలో స్త్రీస్వేచ్ఛా ఉద్యమాలు పెల్లుబికాయి. స్త్రీలు మౌనాన్ని ఛేదించుకుని బయటకొచ్చి నిలదీయటం ఆరంభించటంతో.. దీనిపై వైద్యపరంగా లోతైన, కచ్చితమైన పరిశోధనలు అనివార్యమయ్యాయి.
జీవ సహజం: ఆశ్చర్యకరంగా.. మానవ లైంగిక ప్రవృత్తి ఏ రకంగానూ జంతువుల కంటే భిన్నమైనది కాదనీ, అప్పటి వరకూ నమ్ముతున్న మానసిక, భావోద్వేగ సిద్ధాంతాలన్నీ పూర్తి వాస్తవాలు కావనీ వెల్లడైంది. సెక్స్ అన్నది ప్రాథమికంగా శారీరక జీవ ప్రక్రియ, మానసికాంశాలన్నీ దీనికి సహకరించేవన్న భావన బలపడింది. లైంగిక సమస్యలన్నీ మానసికమైనవేనన్న ధోరణి తప్పని తేలింది.
శరీర విజ్ఞానం:
1982: ఫ్రెంచ్ వాస్క్యులర్ సర్జన్ రోనల్డ్ విరాగ్ తొట్టతొలిగా పురుషాంగంలోకి ఓ మందును ఎక్కించి, కృత్రిమంగా తన క్లినిక్‌లో ఒకరికి స్తంభన తెప్పించాడు. దీంతో పురుషాంగ నిర్మాణం, పనితీరుపై అధ్యయనాలకు ఆస్కారం ఏర్పడింది. అంగం ఎలా స్తంభిస్తుంది, దానిలో ధమనులు, సిరలు, నాడుల పాత్ర ఏమిటో అర్థం చేసుకోవటం ఆరంభమైంది. స్తంభన లోపాలన్నీ మానసికమైనవేనన్న ధోరణి తొలగిపోయి.. కొత్త అవగాహన, ఆలోచనలు మొదలయ్యాయి. శారీరక కారణాలేవీ లేవని తేల్చుకున్నప్పుడే మానసిక చికిత్సలను ఆశ్రయించాలన్న అవగాహన పెంచిన విరాగ్.. 'ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆండ్రాలజీ' అయ్యాడు! 1988లో తొలి ఆండ్రాలజీ పాఠ్యపుస్తకం వెలువడింది.
అడ్డుగోడలు
- మధుమేహం, హైబీపీ
- ఒత్తిడి, డిప్రెషన్
- శారీరక శ్రమ లేకపోవటం
- భాగస్వామితో సత్సంబంధాలు కొరవడటం
కొత్త విప్లవం : సెక్సువల్ మెడిసిన్‌లో కొత్త విప్లవం ఆరంభమైంది. రకరకాల పరికరాలు, పరీక్షలు, చికిత్సా విధానాలు అందుబాటులోకి రావటం ఆరంభమైంది. అంగస్తంభన సమస్య ఉందో లేదో, ఉంటే ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా చెప్పే రిజిస్కాన్, పురుషాంగంలోకి రక్త ప్రసారం ఏ తీరులో ఉందో చెప్పే 'పీనైల్ డాప్లర్' పరీక్ష, రకరకాల సమస్యలను సరిదిద్దే మైక్రోసర్జరీ, మైక్రోసూచర్స్, వాక్యూమ్ డివైస్‌లు, కృత్రిమంగా అమర్చే 'పీనైల్ ప్రోస్థెసిస్' వంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి.
స్త్రీ సమస్యలు
స్త్రీలలో సెక్స్ సమస్యలు సంక్లిష్టమైనవి. వీటిపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది.
- కోరిక లేకపోవటం
- విముఖత సమస్యలు
- తృప్తి, భావప్రాప్తి సమస్యలు
- బాధాకర సెక్స్
- సంతాన రాహిత్యం
- స్తంభన లోపాలు
- సంతాన రాహిత్యం
- స్ఖలన సమస్యలు
- మలి వయసు ఆండ్రోపాజ్
- అంగం వంపు సమస్యలు
- ఇద్దరిలోనూ చక్కటి ఆరోగ్య భావన
- పెరిగే ఆయుఃప్రమాణం
- తగ్గే బరువు, గుండెపోటు, పక్షవాతం ముప్పు
- తగ్గే డిప్రెషన్. చక్కటి నిద్ర అదనపు లాభం.
- అందంగా నిగారించే చర్మం
1998: వయాగ్రా ఆవిష్కారం..
సెక్స్ వైద్యరంగంలో పెను సంచలనం! ఎందుకంటే పురుషుల్లో చాలా భాగం పూర్తి నపుంసకులూ ఉండరు, పూర్తి సామర్థ్యం ఉన్నవాళ్లూ ఉండరు. ఎంతోమందికి అంగస్తంభనలో పాక్షికంగా సమస్యలుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకం పురుష లోపానికి.. ప్రత్యేకమైన ఔషధంగా వయాగ్రా రంగం మీదికి వచ్చింది.
అందరికీ లాభం: ప్రజల లైంగిక ఆరోగ్యం చక్కగా ఉండటమన్నది కేవలం వాళ్లకే కాదు.. వాళ్లు పని చేస్తున్న కంపెనీలకూ, ప్రభుత్వాలకూ, సమాజానికి కూడా అవసరం. లైంగిక ఆరోగ్యమన్నది వాళ్ల ఉత్పాదకతతో ముడిపడిన అంశమని స్పష్టంగా తేలింది. లైంగికంగా ఆరోగ్యంగా లేకపోతే.. రోజంతా ఆఫీసులోనే కూర్చున్నా వాళ్ల మనసుల్లో ఏదో బాధ పీడిస్తుంటుంది. ఇది వాళ్ల పనితీరును, ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.
చక్కటి లైంగిక ఆరోగ్యానికి కావాల్సింది..
పెద్దపెద్ద రొమ్ములు, పొడవాటి అంగాల కోసం ఆరాటం కాదు..
అపోహల్లేని.. చక్కటి అవగాహనతో కూడిన
ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సెక్స్ జీవితం! అది ముఖ్యం!!
పెద్దపెద్ద రొమ్ములు, పొడవాటి అంగాల కోసం ఆరాటం కాదు..
అపోహల్లేని.. చక్కటి అవగాహనతో కూడిన
ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సెక్స్ జీవితం! అది ముఖ్యం!!

No comments:
Post a Comment